ఫ్యాక్ట్ చెక్: వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలిపినందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెంప పగలగొట్టిన బీహార్ యువకుడు
2022 నాటి వీడియోను ఇటీవలిదిగా ప్రచారం;

వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 రాజ్యాంగ చెల్లుబాటును వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను అత్యవసర ప్రాతిపదికన విచారించేందుకు అన్ని విషయాలు పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్, కెవి విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. జమాయిత్ ఉలామా ఇ హింద్, మజ్లిస్ నేత, ఎంపి అసదుద్దిన్ ఒవైసి , కాంగ్రెస్ ఎంపి మెహమ్మద్ జావెద్, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇతరుల పిటిషన్లు కూడా ధర్మాసనం పరిశీలనకు వచ్చాయి.
ఉభయ సభలలో చర్చల తర్వాత పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025కు అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ఏప్రిల్ 5న తన ఆమోదం తెలిపారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) ఏప్రిల్ 6 న సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసింది. పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరింది.
చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ, నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ వంటి పార్టీలు వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. నితీష్ కుమార్ పార్టీ అయిన జనతాదళ్ (యునైటెడ్) కు రాజీనామా చేస్తున్నట్లు పలువురు నాయకులు ప్రకటించారు. జెడి(యు) సీనియర్ నాయకుడు మొహమ్మద్ ఖాసిం అన్సారీ, బీహార్‌లోని పార్టీ మైనారిటీ ప్రదేశ్ కార్యదర్శి మొహమ్మద్ నవాజ్ మాలిక్ పార్టీకి రాజీనామా చేశారు.
ఇంతలో ఓ యువకుడు ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా నితీష్ కుమార్ చెంప పగులగొట్టాడంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
"వక్ఫ్ బిల్లు కు మద్దతు ఇచ్చాడనే కోపంతో బీహార్ ముఖ్యమంత్రి (JDU)నితీష్ కుమార్ గారికి చెంప పగలగొట్టిన బీహార్ యువకుడు..
జాగ్రత్త అయ్యా అసలే ఆగ్రహంతో ఉన్నారు" అంటూ పోస్టు పెట్టారు.
https://www.facebook.com/
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో ఇటీవలిది కాదు. వక్ఫ్ బిల్లుతో ఎలాంటి సంబంధం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. 2022 మార్చి నెలలో నితీష్ కుమార్ పై ఓ యువకుడు దాడి చేశాడంటూ పలు మీడియా కథనాలను మేము చూశాం.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన స్వస్థలమైన భక్తియార్‌పూర్‌లో ఉండగా ఒక వ్యక్తి దాడి చేశాడని, దాడి ఘటన సిసిటివి కెమెరాలో రికార్డు అయిందని నివేదికలు తెలిపాయి. ఆ వ్యక్తిని అరెస్టు చేసి పోలీసులు కస్టడీలో తీసుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్థానిక సఫర్ ఆసుపత్రి సముదాయంలో రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు శిల్పభద్ర యాజీ విగ్రహానికి ముఖ్యమంత్రి నివాళులర్పించబోతున్న సమయంలో ఈ దాడి జరిగింది. వెనుక నుండి వచ్చిన ఆ వ్యక్తి వేగంగా దూసుకు వచ్చి నితీష్ కుమార్ వీపుపై కొట్టడం కనిపించింది. వెంటనే ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది అతన్ని ఈడ్చుకెళ్లారు. "అతన్ని కొట్టకండి. ముందుగా అతను ఏమి చెబుతున్నాడో తెలుసుకోండి" అని ముఖ్యమంత్రి తన భద్రతా సిబ్బందికి చెప్పారు.
ఇదే విషయాన్ని పలు మీడియా సంస్థల కథనాల్లో ఉన్నాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
భక్తియార్‌పూర్‌లోని అబూ మహ్మద్ పూర్‌లో నివసించే శంకర్‌కు ఒక ఆభరణాల దుకాణం ఉంది. పాట్నా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆ వ్యక్తి మానసికంగా అస్థిరంగా ఉన్నాడని తేలింది. అతని కుటుంబ సభ్యులు అతన్ని ఎక్కువగా ఇంట్లోనే ఉంచుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కుటుంబంలోని వాళ్లు బయటకు వెళ్లడంతో అతను ఈ ఘటన జరిగిన రోజు తప్పించుకుని బయటకు వెళ్లగలిగాడని పోలీసుల విచారణలో తేలింది.
ఇక వైరల్ అవుతున్న వీడియోలో లోగో మోజో అని ఉంది. రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా మాకు అదే లోగో ఉన్న అసలైన వీడియో లభించింది. "Watch | Bihar CM Nitish Kumar Slapped By Man During A Function In Bakhtiyarpur" అనే టైటిల్ తో మార్చి 27, 2022న Mojo Story యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియోను అప్లోడ్ చేశారు.
భక్తియార్‌పూర్‌లో పండిట్ శీలభద్ర యాజీకి నివాళులు అర్పిస్తున్న సమయంలో బీహార్ ముఖ్యమంత్రిపై ఒక యువకుడు దాడికి ప్రయత్నించాడని Mar 27, 2022న ANI అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసిన పోస్ట్ కూడా మాకు లభించింది.
కాబట్టి, ఓ మానసిక వికలాంగుడు 2022లో నితీష్ కుమార్ పై చేసిన దాడిని ఇటీవలిదిగా ప్రచారం చేస్తున్నారు.
వక్ఫ్ బిల్లుతో ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదు.
Claim : 2022 నాటి వీడియోను ఇటీవలిదిగా ప్రచారం చేస్తున్నారు
Claimed By : Social Media Users
Fact Check : False