ఫ్యాక్ట్ చెక్: ఏప్రిల్ 7, 2025న ఢిల్లీలో భారీ భూకంపం సృష్టించిన భీభత్సాన్ని వైరల్ వీడియో చూపిస్తోందనేది నిజం కాదు
ఏప్రిల్ 4, 2025న నేపాల్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఉత్తరభారతదేశంలోని గోరఖ్‌పూర్;

ఏప్రిల్ 4, 2025న నేపాల్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఉత్తరభారతదేశంలోని, గోరఖ్‌పూర్, పాట్నాతో సహా పలు నగరాలలో కూడా ఈ ప్రకంపనలు వచ్చాయి. ఏప్రిల్ 1న, రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో కూడిన ఒక మోస్తరు భూకంపం లడఖ్‌లోని లేహ్ ప్రాంతాన్ని కుదిపేసింది. ప్రజలు భయంతో పరుగులు తీశారు. అయితే అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఇలాంటి సంఘటనలు తరచూ సంభవిస్తుండడం వల్ల ప్రజలు ఎప్పుడు ఎక్కడ భూకంపం వస్తుందో అని భయపడుతున్నారు. అయితే ఈ భయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కొందరు తప్పుడు వార్తలను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు.
“दिल्ली में तेज़ भूकम्प आने के कारण 98 हजार लोगों कि मौत, 87 हजार लोग घायल हुए, लाइव अपडेट, महाप्रलय 7/4/2025” అంటూ హిందీలో టెక్స్ట్ తో వీడియో వైరల్ అవుతూ ఉంది. భవనాలు కూలిపోవడం, వాహనాలు అదుపు తప్పడం వంటి విధ్వంసాన్ని చూపించే వీడియోను మనం చూడొచ్చు. "ఢిల్లీలో భారీ భూకంపం కారణంగా 98,000 మంది మరణించారు, 87,000 మంది గాయపడ్డారు, లైవ్ అప్‌డేట్స్ 7/4/2025" అని ఆ పోస్టు పేర్కొంది.
వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన అబద్దం. విధ్వంసానికి సంబంధించిన వీడియో ఢిల్లీకి చెందినది కాదు.
ఏప్రిల్ 7, 2025న ఢిల్లీలో భూకంపం వచ్చిందా? లేదా? అని తెలుసుకోవడానికి మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. ఏ మీడియా నివేదికల్లోనూ అలాంటి సంఘటన నివేదించలేదని మాకు తెలిసింది. ఇటీవల భూకంపం ఏప్రిల్ 4, 2025న నేపాల్‌లో సంభవించింది, దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైంది. ఉత్తర భారతదేశంలో స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. మార్చి 28న 112 ప్రకంపనలు సంభవించాయని ఆ దేశ వాతావరణ విభాగం తెలిపింది. మార్చి 28న మయన్మార్ దేశంలో 7.9 తీవ్రతతో వినాశకరమైన భూకంపం సంభవించింది. ఆ తర్వాత పలు ప్రకంపనలు సంభవించాయి. మయన్మార్‌లో
మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము, ఆ వీడియో భారతదేశానికి సంబంధించినది కాదని, జూలై 2023లో క్రొయేషియాలో సంభవించిన తుఫాను దృశ్యాలని తెలిసింది. "జూలై 19, 2023న జాగ్రెబ్‌లో తుఫాను" అనే శీర్షికతో పావెల్ స్కైవర్కర్ అనే ఛానెల్ ప్రచురించిన యూట్యూబ్ వీడియోను మేము కనుగొన్నాము.
“Samo neki od užasnih prizora u našem gradu danas.” అనే టైటిల్ తో ఇదే వీడియో జూలై 19, 2023న ఫేస్‌బుక్‌లో కూడా షేర్ చేశారు. తమ నగరంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుందని తెలిపారు.
జూలై 2023లో ప్రచురితమైన వార్తల నివేదికల ప్రకారం, జూలై 19 బుధవారం బలమైన గాలులు, భారీ వర్షంతో శక్తివంతమైన తుఫాను క్రొయేషియా, బోస్నియా, స్లోవేనియాలో విధ్వంసం సృష్టించింది. ఇందులో కనీసం ఐదుగురు మరణించగా, డజన్ల కొద్దీ గాయపడ్డారని పోలీసులు, స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి.
క్రొయేషియా రాజధాని జాగ్రెబ్‌లో చెట్లు కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారని క్రొయేషియా పోలీసులు తెలిపారు. వీధిలో బయట ఉన్నప్పుడు 50 ఏళ్ల వ్యక్తిపై చెట్లు కూలాయని, 48 ఏళ్ల వ్యక్తి తన కారులో ఉండగా ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తమ ప్రకటనలో తెలిపారు. తూర్పు క్రొయేషియాలోని సెర్నిక్ పట్టణంలో కారుపై చెట్టు కూలి ఒకరు మరణించారని, జాగ్రెబ్‌లోని మరో చోట, క్రేన్ కూలిపోవడంతో 36 ఏళ్ల వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని పోలీసు ప్రకటన తెలిపింది.
తుఫాను అకస్మాత్తుగా ఆకాశాన్ని చీకటిగా మార్చిందని, పలు నివేదికల ప్రకారం సాయంత్రం 4 గంటల నుండి జాగ్రెబ్ ను భారీ వర్షం, ఆకస్మిక వరదలు, బలమైన గాలులు చుట్టుముట్టాయి. దీంతో నగర రవాణా వ్యవస్థ అస్థవ్యస్థమైంది. విద్యుత్తుకు అంతరాయం కలిగించింది. చెట్లు కూలిపోవడంతో రాకపోకలు లేకుండా పోయాయి. సహాయం కోసం వందలాది కాల్స్ ఒకేసారి రావడంతో జాగ్రెబ్ అత్యవసర సేవల విభాగాలు పౌరులను ఓపికగా ఉండాలని కోరాయి.
అందువల్ల, వైరల్ వీడియో ఢిల్లీలో సంభవించిన భూకంపానికి చెందింది కాదు. ఇది క్రొయేషియాలో తుఫాను దృశ్యాలను చూపిస్తుంది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : ఏప్రిల్ 7, 2025న ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. వేలాది మంది మరణించారు
Claimed By : Social media users
Fact Check : False