టాప్ లో హైదరాబాద్.. ఆనందంలో కేటీఆర్

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో రికార్డును అందుకుంది. ఉత్తమ జీవన ప్రమాణాలతో

Update: 2023-12-15 11:54 GMT

hyderabad city

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో రికార్డును అందుకుంది. ఉత్తమ జీవన ప్రమాణాలతో కూడిన ప్రపంచ నగరాల ర్యాంకింగ్స్‌ లో భాగంగా దేశంలోనే బెస్ట్ సిటీగా మన హైదరాబాద్ నిలిచింది. పుణే, బెంగళూరు లాంటి ఐటీ నగరాలను వెనక్కి నెట్టి అత్యుత్తమ నగరంగా నిలిచింది. హైదరాబాద్‌ బెస్ట్‌ సిటీగా నిలవడం 2015 నుంచి ఇది ఆరోసారి. ‘మెర్సర్’ అనే అమెరికాకు చెందిన కన్సల్టెన్సీ, ఆర్థిక సేవల సంస్థ తాజాగా ఉత్తమ జీవన ప్రమాణాలతో కూడిన ప్రపంచ నగరాల ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాకింగ్‌లో భారతదేశం నుంచి హైదరాబాద్ మాత్రమే కాకుండా పూణే, బెంగళూరు, చెన్నై, ముంబై నగరాలకు చోటు దక్కింది. వీటన్నిటిలోనూ హైదరాబాద్ నగరం ముందు ఉండడం విశేషం. ఈ లిస్టులో హైదరాబాద్‌కు 153వ స్థానం దక్కగా.. పుణే 154, బెంగళూరు 156వ స్థానంలో నిలిచాయి. చెన్నై 161, ముంబై 164, కోల్‌కత్తా 170, న్యూ ఢిల్లీ 172 స్థానాల్లో ఉన్నాయి.

మెర్సర్స్‌ క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ ర్యాంకింగ్స్‌ 2023లో భాగంగా దేశంలోని నగరాల్లో హైదరాబాద్ టాప్ లో నిలవడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మెర్సర్‌ జాబితా ప్రకారం హైదరాబాద్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం గొప్ప విషయమని కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ 2015 నుంచి వరుసగా ఆరోసారి ఈ ఘనత సాధించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నగరవాసులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా వియన్నా ( ఆస్ట్రియా) తొలి స్థానంలో నిలిచింది. వియన్నా తర్వాత రెండో స్థానంలో జురిచ్‌ (స్విట్జర్లాండ్‌), మూడో స్థానంలో ఆక్లాండ్‌ (న్యూజిలాండ్‌) నిలిచాయి. ఈ ర్యాంకింగ్స్‌లో ఖార్టౌమ్‌(సూడాన్‌) 241వ ర్యాంక్‌తో అట్టడుగున నిలిచింది. ఆ తర్వాత ఇరాక్‌లోని బాగ్దాద్‌ 240వ ర్యాంకులో ఉంది.


Tags:    

Similar News