Hyderabad : హైదరాబాదీలూ... మీరూ మాస్క్ లు ధరించాల్సిందేనట
హైదరాబాద్ లో వాయు కాలుష్యం మరింత పెరుగుతుంది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు ప్రకటన చేశారు.
హైదరాబాద్ లో వాయు కాలుష్యం మరింత పెరుగుతుంది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు ప్రకటన చేశారు. గాలి నాణ్యత తగ్గిపోతుందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 మార్క్ దాటేయడంతో మాస్క్ లు ధరించడం మంచిదని సూచిస్తున్నారు. ఇప్పటికే వాయు కాలుష్యతంతో పాటు పొగమంచు కూడా పెరగడంతో అనేక రకాలైన శ్వాసకోశ వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వివిధ లక్షణాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.
ఆరు రోజుల పాటు...
ఆరు రోజుల పాటు తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ చెబుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా పన్నెండు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హైదరాబాద్ లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పది గంటలయినా చలి తీవ్రత తగ్గడం లేదు దీంతో శ్వాస కోశ వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. రానున్న కాలంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని, ఇంకా కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అవసరమైతే తప్ప...
అందుకే బయటకు వచ్చే వారు కాలుష్యం బారిన పడకుండా మాస్క్ లను ధరించడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఏమాత్రం ఒంట్లో నలతగా అనిపించినా వెంటనే వైద్యులకు సంప్రదించాలని కోరుతున్నారు. ఇదే సమయంలో దూర ప్రయాణాలను కూడా పెట్టుకోకుండా ఇంటిపట్టునే ఉండటం మంచిదన్న సూచనలను వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాచి వడబోసిన నీళ్లను తాగడం మంచిదని చెబుతున్నారు.