Bouncers : బౌన్సర్లు ఉన్నది ఎందుకు..? కొట్లాటలకా? సెక్యూరిటీకా?
బౌన్సర్లను నియమించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. సెలబ్రిటీలు అందరూ ప్రయివేటు సెక్యురిటీని నియమించుకుంటున్నారు.
బౌన్సర్లను నియమించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. సెలబ్రిటీలు అందరూ ప్రయివేటు సెక్యురిటీని నియమించుకుంటున్నారు. అందులో తప్పులేదు. ముఖ్యంగా సినిమా హీరోలు బయటకు వచ్చినప్పుడు అభిమానుల తాకిడి నుంచి బయటపడటానికి బౌన్సర్ల నుంచి రక్షణ పొందుతుంటారు. సాధారణంగా పోలీసు బందోబస్తు కల్పిస్తున్నప్పటికీ తాము నియమించుకున్న బౌన్సర్లు నిరంతరం కాపలా కాస్తుంటారు. హీరోపై ఎలాంటి దాడులు జరకుండా చర్యలు తీసుకుంటారు. ఆయనను దాడుల నుంచి, అభిమానుల తాకిడి నుంచి కాపాడటానికి బౌన్సర్లను నియమించుకుంటారు. బోల్డంత డబ్బు పోసి మరీ బౌన్సర్లను నియమించుకుంటారు.
బౌన్సర్ల హడావిడి...
అయితే సినీనటుడు మోహన్ బాబు ఇంటి వద్ద బౌనర్ల హడావిడి మరో చర్చకు దారితీసింది. ఇరు వర్గాల బౌన్సర్లు కొట్లాటలకు సిద్ధమవ్వడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పాలి. మంచు విష్ణు, మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్లు, మంచు మనోజ్ కు చెందిన బౌన్సర్లు జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలో గత మూడు రోజుల నుంచి హడావిడి చేస్తున్నారు. ఇది కుటుంబ సభ్యుల మధ్య వివాదం. ఆ కుటుంబంలో ముగ్గురూ సెలబ్రిటీలే. సినిమా రంగానికి చెందినవారు కావడంతో పాటు వారు రక్తసంబంధీకులు కూడా కావడంతో వారి మధ్య ఘర్షణలు జరిగితే ఆపడానికి బౌన్సర్లు నియమించుకున్నారా? లేక ఘర్షణల కోసం ఏర్పాటు చేసుకున్నారా? అన్న చర్చ మాత్రం బయలుదేరింది.
భద్రత కోసమే అయినా...
నిజానికి బౌన్సర్లు ప్రయివేటు సంస్థలకు చెందిన వారు. వారు తమకు వేతనాలు ఇచ్చేవారి భద్రత కోసం మాత్రమే వస్తారు. అయితే నిన్న మోహన్ బాబు ఇంటివద్ద జరిగిన ఘటన చూస్తే బౌన్సర్ల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలిసింది. విష్ణుకు చెందిన బౌన్సర్లు మంచు మనోజ్ కు చెందిన బౌన్సర్లను ఇంటి బయటకు తోశారు. రెండు వర్గాలకు చెందిన బౌన్సర్లు ముఖాముఖి తలపడటంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు కూడా బౌన్సర్లను రెండు రోజుల పాటు అక్కడే ఉండేలా చూసినందుకు ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు. నిన్న మీడియాపై దాడి జరిగిన తర్వాత మాత్రమే ఇరు వర్గాలకు చెందిన బౌన్సర్లను మోహన్ బాబు ఇంటి బయటకు పంపడం జరిగిందని చెబుతున్నారు. మొత్తం మీద భద్రత కోసం ఏర్పాటు చేసుకోవాల్సిన బౌన్సర్లను కొట్లాటలకు ఉపయోగించుకోవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.