ఫ్లైఓవర్ పై నుండి కింద పడి మరణించిన స్వీటీ
ఫ్లై ఓవర్ల మీద వెళ్లే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా
ఫ్లై ఓవర్ల మీద వెళ్లే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. కొన్ని కొన్ని సార్లు ఫ్లై ఓవర్ల మీద నుండి వాహనాలు కింద పడిపోయిన ఘటనలను మనం చూసే ఉంటాం. గతంలో అలాంటి ఘటనలు హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్నాయి. ఫ్లై ఓవర్ పై నుండి కారు కింద పడిన ఘటనను హైదరాబాద్ వాసులెవరూ మరచిపోలేరు. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.
హైటెక్ సిటీ ఫ్లైఓవర్ పై నుండి కింద పడి యువతి మృతి చెందింది. కోల్‌కతాకు చెందిన స్వీటీ అనే యువతి తన స్నేహితుడు రాయన్ ల్యూకేతో కలిసి జేఎన్‌టీయూ నుంచి ఐకియాకు బైక్‌పై బయలుదేరింది. అయితే రాయన్ బైక్ను అతివేగంగా నడపడంతో అదుపు తప్పి ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్పై వెనుక కూర్చున్న స్వీటీ అమాంతం గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్ పై నుండి కిందకు పడిపోయింది. రాయన్కు గాయాలయ్యాయి. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. స్వీటీ చికిత్స పొందుతూ చనిపోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 22 సంవత్సరాల స్వీటీ మరణవార్తను ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేసారు.