కెనడాలో జరిగిన సిక్కు హత్యలో భారత్ ప్రమేయం: జస్టిన్ ట్రూడో

కెనడా తన దేశంలో జరిగిన సిక్కు హత్యలో భారత్ ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో

Update: 2023-09-19 06:47 GMT

కెనడా తన దేశంలో జరిగిన సిక్కు హత్యలో భారత్ ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో భారతదేశానికి చెందిన సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించింది. ఈ చర్య కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా పౌరుడు, సిక్కు నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను జూన్‌లో హత్య చేశారు. ఈ హత్యకు భారతదేశానికి సంబంధం ఉందనే విశ్వసనీయ సమాచారం తమకు దొరికిందని.. కెనడా దీనిపై దర్యాప్తు చేస్తోందని ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తెలిపారు. ట్రూడో సోమవారం పార్లమెంటులో మాట్లాడుతూ ఈ హత్యకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. హర్‌దీప్ సింగ్ నిజ్జార్‌ హత్య వెనుక భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు తమ ప్రభుత్వం వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. ఈ విషయంలో తమకు సహకరించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.

భారత ప్రభుత్వం హర్‌దీప్ సింగ్ నిజ్జార్‌ను వాంటెడ్ టెర్రరిస్టుగా ప్రకటించింది. అయితే ఈ ఏడాది జూన్ 18న వాంకోవర్ శివారులోని సర్రే ప్రాంతంలో అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ హత్య తర్వాత ఇండియా-కెనడా మధ్య మాటల యుద్దం పెరిగింది. దౌత్యపరంగా కూడా దూరం పెరుగుతూ వస్తోంది. సిక్ రైట్ వింగ్ కార్యకర్తలను హ్యాండిల్ చేయడంలో కెనడా విఫలమైందని భారత్ ఆరోపిస్తోంది. ట్రూడో ఆరోపణల నేపథ్యంలోనే ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసిన కెనడా.. భారత రాయబారిపై బహిష్కరణ వేటు వేసింది. కెనడాలోని భారత దౌత్యకార్యాలయానికి చెందిన ఇంటెలిజెన్స్‌ విభాగం అధిపతిని బహిష్కరించినట్లు విదేశాంగ మంత్రి మెలనీ జాలీ తెలిపారు.


Tags:    

Similar News