కువైట్ కు ఇంటిపని వీసా..... సౌదీలో ఒంటెల కాపరి పని...

అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా, కువైట్ నుంచి సౌదీకి అక్రమంగా సరిహద్దు దాటింపు

Update: 2024-08-13 11:28 GMT

◉ అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా 

◉ కువైట్ నుంచి సౌదీకి అక్రమంగా సరిహద్దు దాటింపు 

◉ రక్షించాలని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ కు వినతి పత్రం 

అరేబియన్ ఎడారిలో సరైన వసతి, ఆహారం లేదని, ఆరోగ్యం క్షీణిస్తోందని తనను రక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి రాథోడ్ నాందేవ్ అనే ఒంటెల కాపరి పంపిన వీడియో సంచలనం రేపింది. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్ అనే గిరిజనుడిని కువైట్ కు ఇంటిపని (డొమెస్టిక్ హెల్పర్) వీసాపై తీసికెళ్ళి అక్రమంగా దేశ సరిహద్దులు దాటించి సౌదీ అరేబియా ఎడారిలో బలవంతంగా ఒంటెల కాపరిగా పనిచేయిస్తున్న విషయం ఈ వీడియోతో వెలుగులోకి వచ్చింది. 

కువైట్ లో ఉన్న తెలిసిన వ్యక్తి సహకారంతో ఢిల్లీ లోని 'సనా ఫెసిలిటేషన్ సెంటర్' అనే లైసెన్స్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా రాథోడ్ నాందేవ్ అక్టోబర్ 2023 లో ఇంటిపని వీసాపై కువైట్ కు వెళ్ళాడు.

కువైట్, సౌదీ అరేబియా సరిహద్దు లోని ఎడారిలో చిక్కుకుపోయిన తన భర్తను రక్షించి ఇండియాకు తీసుకురావాలని రాథోడ్ నాందేవ్ భార్య లక్ష్మి హైదరాబాద్ లోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ (పిఓఇ) అమిత్ కుమార్ కు సోమవారం వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి ఆమె వెంట పిఓఇ ని కలిసి సమస్యను వివరించారు.

Tags:    

Similar News