Bangladesh : బంగ్లాదేశ్ ఇక బాగుపడదా? ఎవరు అధికారంలోకి వచ్చినా అంతేనా?
బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఏమాత్రం మారలేదు. రోజుకో డిమాండ్ తో ఆందోళనకారులు దేశంలో ఉద్రిక్తతలను సృష్టిస్తున్నారు
దేశంలో ఒకసారి తిరుగుబాటు మొదలయితే.. తమ ఆందోళనలకు ఇక తిరుగులేదని భావిసతే ఇక చిన్న విషయాలకు కూడా అదే మనస్తత్వం ఉంటుంది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో ఇప్పుడు ఇదే జరుగుతున్నట్లుంది. రిజర్వేషన్ల విషయంలో నిరుద్యోగ యువత ప్రారంభించిన పోరాటం చివరకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు దారితీసింది. ఆమె కట్టుబట్టలతో దేశం వదిలిపోయేలా చేసింది. తర్వాత అల్లరి మూకలు ఊరుకోలేదు. షేక్ హసీనా నివాసంలో ఉన్న వస్తువులను చేతికి దొరికినట్లు తీసుకెళ్లిపోయారు. ఫ్యాన్ల దగ్గర నుంచి లైట్లు, సోఫాలు ఇలా ఒకటేమిటి? ఏ వస్తువు లేకుండా హసీనా బంగ్లాను అల్లరిమూకలు లూటీ చేశాయి. ఆందోళన కారులు చేసిన ఈపనిపై అంతర్జాతీయ సమాజంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆందోళనకారులకు సహకరించేలా?
ఇక వారి డిమాండ్ మేరకు దేశం వదిలి షేక్ హసీనా వెళ్లిపోయినా అక్కడ ఆందోళన మాత్రం ఆగలేదు. ఈరో్జు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చారు. వీరంగం చేశారు. అయితే గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ఈ పరిణామాలను బంగ్లాదేశ్ సైన్యం గమనిస్తుంది. ఆందోళనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఆందోళనకారులను ఉసిగొల్పుతున్నట్లు సైన్యం సహకరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది అంతర్జాతీయ కుట్రగానే అనుమానించాల్సి వస్తుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
వారి డిమాండ్లతో...
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. దీంతో ఆయన రాజీనామా చేయకతప్పింది. రిజర్వేషన్ల విషయంలో హసీనా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారన్న కారణంగా చీఫ్ జస్టిస్ పదవి నుంచి ఆయన రాజీనామా చేయాలని, ఇతర న్యాయమూర్తులు కూడా తమ పదవుల నుంచి తప్పుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. వీరితో పాటు బంగ్లాదేశ్ కేంద్ర బ్యాంక్ గవర్నర్ అబ్దుల్ రవూఫ్ తాలూక్‌దేర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఆందోళనకారులు డిమాండ్ చేసినట్లు తలాడిస్తే భవిష్యత్ లో ఏ నేత ఏలేందుకు ఇష్టపడరని అర్ధమవుతుంది. బంగ్లాదేశ్ సైన్యం కూడా ఇలా వ్యవహరించడంపై అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొంటుంది.