పర్యాటకులకు హాంకాంగ్ బంపర్ ఆఫర్.. ఫ్రీ గా టికెట్లు ఇస్తామన్న ప్రభుత్వం

తమ దేశానికి రావాలనుకునే పర్యాటకులకు ఒకటి కొంటే మరొ టికెట్ ఉచితం పద్ధతిలో, లక్కీ డ్రా విధానంలోనూ..

Update: 2023-02-03 08:37 GMT

hangkong free air tickets

కరోనా కారణంగా చాలా వ్యాపార రంగాలు కుదేలైన విషయం తెలిసిందే. వాటిలో పర్యాటక రంగం కూడా ఒకటి. తిరిగి మళ్లీ పర్యాటకరంగానికి పునర్వైభవాన్ని తెచ్చేందుకు.. హాంకాంగ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. విదేశీ పర్యాటకులకు ఉచితంగా ఫ్లైట్ టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటన చేసింది. ‘హలో హాంకాంగ్’ ప్రచార కార్యక్రమంలో.. 5 లక్షల ఫ్లైట్ టికెట్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు హాంకాంగ్ విమానయాన సంస్థలు గురువారం ప్రకటన విడుదల చేశాయి.

కాగా.. తమ దేశానికి రావాలనుకునే పర్యాటకులకు ఒకటి కొంటే మరొ టికెట్ ఉచితం పద్ధతిలో, లక్కీ డ్రా విధానంలోనూ టిక్కెట్లను గెలుచుకోవచ్చని ప్రతినిధులు తెలిపారు. ఈ ఏడాది మార్చి నుండి సెప్టెంబర్ వరకు విడతల వారీగా ఉచిత టికెట్లను పంపిణీ చేస్తామని వివరించారు. టికెట్లతో పాటు పలు కూపన్లు, క్యాష్ వోచర్లను గెలుచుకునే అవకాశం కూడా ఉందని వివరించారు. ఉచిత విమాన టికెట్ల కోసం హాంకాంగ్ ఎయిర్ లైన్స్ సంస్థలు ఏకంగా 2 బిలియన్ హాంకాంగ్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.2100 కోట్లు ఖర్చు చేస్తున్నాయి.
మార్చిలో ఇండియా సహా ఆగ్నేయ దేశాల (సౌత్ ఈస్ట్ ఆసియా) పౌరులకు టికెట్లు కేటాయిస్తామని హాంకాంగ్ విమానయాన సంస్థల ప్రతినిధి వెల్లడించారు. ఏప్రిల్ లో చైనా, మే నెలలో నార్త్ ఈస్ట్ ఆసియా తో పాటు ఇతర దేశాల పౌరులకు టికెట్లు కేటాయిస్తామని వివరించారు. జులైలో తమ దేశ పౌరులకు కూడా ఈ ఆఫర్ ను వర్తింపజేస్తామని తెలిపారు.



Tags:    

Similar News