నాలుగు ఉద్యోగాలను సొంతం చేసుకున్న ఖమ్మం మహిళ

ఖమ్మంకు చెందిన మహిళ ఏకంగా నాలుగు ఉద్యోగాలను సొంతం చేసుకుని భళా అనిపించుకుంటూ

Update: 2024-03-01 11:51 GMT

ప్రభుత్వ ఉద్యోగం.. ఒకటి సాధించడం కూడా చాలా కష్టమైన పనే!! ఎంతో శ్రమతో పాటూ.. శిక్షణ కూడా అవసరం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కొందరు తమ జీవితాంతం ప్రయత్నిస్తూ ఉంటారు. మరొకొందరు ప్రయత్నించగానే ఇట్టే ఉద్యోగాలను సొంతం చేసుకుంటూ ఉంటారు. మరికొందరేమో.. ఒక ఉద్యోగం ఏమి ఖర్మ.. ఒకే చేత్తో ఎన్ని ఉద్యోగాలనైనా ఒడిసిపట్టేయగలరు. అలా ఖమ్మంకు చెందిన మహిళ ఏకంగా నాలుగు ఉద్యోగాలను సొంతం చేసుకుని భళా అనిపించుకుంటూ ఉంది.

ఖమ్మంలో ఒక యువతి ఏకకాలంలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. కోలపూడి శృతి అనే మహిళ ఎక్సైజ్ కానిస్టేబుల్, మహిళా శిశు సంక్షేమ శాఖలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, గురుకుల లైబ్రేరియన్, గురుకుల డిగ్రీ లెక్చరర్ పోస్టులకు ఎంపికైంది. ఆమె తల్లి కె.పుల్లమ్మ ఖమ్మంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ఔట్‌సోర్సింగ్ వర్కర్‌గా పనిచేస్తుండగా, ఆమె తండ్రి ప్రభాకర్ పెయింటర్‌గా ఉన్నారు. శృతి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి MA (సోషియాలజీ), మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసింది. ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని.. గురుకుల డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాన్ని ఎంచుకోబోతున్నానని శృతి చెప్పారు. 2017లో కోచింగ్‌ తీసుకోవడం మొదలుపెట్టానని.. ఆ తర్వాత 2019లో హైదరాబాద్‌లోని TS SC స్టడీ సర్కిల్‌లో సివిల్ సర్వీసెస్ కోచింగ్‌కి వెళ్లానని వివరించింది. ఆ తర్వాత తన ఇంటి వద్దే ఉంటూ.. జాబ్ టెస్ట్‌లకు ప్రిపేర్ అయ్యానని తెలిపింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతగా లేకపోయినా.. తన తల్లిదండ్రులు తన చదువును కొనసాగించేందుకు ప్రోత్సహించారని వివరించింది. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తన కార్యాలయంలో శ్రుతి, ఆమె తల్లిదండ్రులను ప్రశంసించారు.


Tags:    

Similar News