నిరుద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాక్‌.. ఆ పరీక్ష రద్దు

గత సంవత్సరం నిర్వహించిన జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌ 2 రాత పరీక్షను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రద్దు చేస్తూ కీలక ప్రకటన..

Update: 2023-08-30 05:49 GMT

గత సంవత్సరం నిర్వహించిన జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌ 2 రాత పరీక్షను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది. అయితే ఈ రాత పరీక్షలో చాలా అవకతవకలు జరిగాయని, దీని కాణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఈ పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను మళ్లీ ప్రకటించి పరీక్షను నిర్వహించాలని హైకోర్టు సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన పిటిషన్‌ను అనుమతిస్తూ తుది తీర్పు వెలువరించింది.

కాగా, సింగరేణిలో మొత్తం 177 జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-2 పోస్టులను భర్తీకి గానూ గత సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీన రాత పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 79,898 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. అయితే పరీక్ష నిర్వహణ సమయంలో మాస్‌ కాపీయింగ్, ఇతర అవకతవకలు జరిగాయని పేర్కొంటూ హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. రామగుండంకు చెందిన అభిలాష్‌ తోపాటు పలువురు అభ్యర్ధులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన కోర్టు తీర్పు వెలువడేంత వరకూ ఫలితాలు వెల్లడించరాదని సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో సింగరేణి ఆన్సర్ కీ సైతం విడుదల చేయలేదు.

తాజాగా మరో మారు ఈ పిటిషన్‌పై విచారించిన కోర్టు పరీక్షను సరిగ్గా నిర్వహించలేదని తెలిపింది. దీంతో పరీక్షను రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు. పరీక్ష తేదీని తర్వాత ప్రకటించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి అవకతవకలు జరుగుండా చూడాలని కోర్టు ఆదేశించింది. పరీక్ష అనంతరం ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది ఆన్సర్ కీ విడుదల చేయాలని జస్టిస్‌ మాధవీదేవి పేర్కొన్నారు. అయితే స్టే ఎత్తివేయాలంటూ దాఖలైన మధ్యంతర అప్లికేషన్లను సైతం కోర్టు కొట్టివేసింది.

Tags:    

Similar News