ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఐదో సారి కేజ్రీవాల్ అధికారం పొందడానికి మిగిలిన పార్టీలను మించిపోయేటట్లున్నారు. అలివి కానీ వాగ్దానాలను అమలు చేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించే సంక్షేమ పథకాలను చూస్తే ఎవరికైనా ఇది నిజమనిపించకమానదు. నిజానికి మిగిలిన రాజకీయ నేతలకు, కేజ్రీవాల్ కు చాలా తేడా ఉంటుందని అందరూ భావిస్తారు. ఐఆర్ఎస్ అధికారిగా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూ ఆమ్ ఆద్మీపార్టీని స్థాపించారు. ఇప్పటి వరకూ నాలుగు సార్లు ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీపార్టీని గెలిపించారు.కాంగ్రెస్, బీజేపీలను కాదని అరవింద్ కేజ్రీవాల్ కు పట్టం కడుతూ వస్తున్నారు.
గత ఎన్నికల్లో గెలవడానికి...
అయినా కేజ్రీవాల్ మాత్రం గత ఎన్నికల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాయాన్ని తీసుకున్నారు. ప్రశాంత్ కిషోర్ ఊరికే ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించరు. ఆయన మినిమం ఛార్జి వంద కోట్ల రూపాయలు. అంటే కేజ్రీవాల్ కూడా అంత డబ్బు పెట్టి ఎన్నికల వ్యూహకర్తను నియమించుకున్నారంటే ఫక్తు రాజకీయ నేతగా మారిపోయారు. పంజాబ్ లో గెలవడంతో ఇక అధికార దాహం తీరలేనట్లు ఆయన వ్యవహరిస్తున్నారు. ప్రజలకు మంచి చేస్తూ, అవినీతి లేనిపాలన చేయాల్సిన కేజ్రీవాల్ పై ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు కూడా వచ్చాయి. అందులో నిజనిజాలు ఎంతన్నవి బయట ప్రజలకు తెలియకపోయినా కొన్ని నెలల పాటు జైలు జీవితం గడిపి వచ్చి తర్వాత రాజీనామా చేసేశారు.
అలివికాని హామీలతో...
త్వరలో ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ సందర్భంగా మిగిలిన రాజకీయ పార్టీలకు తీసిపోని విధంగా హామీలను గుప్పిస్తున్నారు. ఆలయాల్లో, గురుద్వారాల్లో పనిచేసే పూజారులు, గ్రంథీల గౌరవవేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు.నెలకు పద్దెనిమిది వేలు ఇస్తామని ప్రకటించి వారిని ఆకట్టుకునేప్రయత్నం చేశారు. దీనికి రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తామని, హనుమాన్ ఆలయంలో రేపు తాను ప్రారంభిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. అంతేకాదు మహిళలకు నెలకు 2,100 రూపాయలు పథకాన్ని కూడా ప్రకటించారు. అలాగే సీనియర్ సిటిజన్లకు మరో స్కీమ్ ను ప్రకటించి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కేజ్రీవాల్ ఐదోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఆయన పడుతున్న పాట్లు మాత్రం ఇతరరాజకీయనేతలకు ఏ మాత్రం భిన్నంగా లేవన్నది అర్థమవుతుంది.