ఎగ్జిట్ పోల్స్ బీజేపీకే అనుకూలమా?
ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి
ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఫలితాలు రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పలు సంస్థలు వెల్లడించాయి. అయితే రెండోసారి కూడా త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి.
మేఘాలయలో హంగ్...
నాగాలాండ్ లో మిత్రపక్షంతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. మేఘాలయలో మాత్రం హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. త్రిపురలో మొత్తం అరవై స్థానాలుండగా బీజేపీ కూటమి 32 స్థానాలు దక్కించుకుంటుందని తేల్చింది. లెఫ్ట్ పార్టీ పదిహేను స్థానాలకే పరిమితమవుతుందని తేల్చింది. నాగాలాండ్ లో ఉన్న అరవై స్థానాలకు గాను బీజేపీ కూటమి 42 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని తేల్చింది. ఇక్కడ కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానానికే పరిమితమవుతుందని పేర్కొంది. మేఘాలయలో ఉన్న అరవై స్థానాల్లో మాత్రం బీజేపీ ఆరు స్థానాలకే పరిమితమవుతుండగా, ఎన్‌పీపీ ఇరవై, తృణమూల్ కాంగ్రెస్ పదకొండు, కాంగ్రెస్ ఆరు స్థానాలకే పరిమితమై హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపాయి.