Parliament Attack : సీన్ రీక్రియేషన్ చేస్తే అసలు బాగోతం బట్టబయలవుతుందిగా?
పార్లమెంటులో ఇటీవల దాడికి దిగడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది
పార్లమెంటులో ఇటీవల దాడికి దిగడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. అసలు నిందితులు పార్లమెంటు లోపలికి ఎలా ప్రవేశించారు? అత్యంత కట్టుదిట్టమైన భద్రత నుంచి వాళ్లు తప్పించుకుని లోనికి ఎలా రాగలిగారు? సెక్యూరిటీ అధికారుల కళ్లను ఎలా కప్పగలిగారు? ఇలాంటి విషయాలు వెలుగు లోకి రావాలని యావత్ భారత్ దేశం కోరుకుంటుంది. ఎందుకంటే నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనంలోకి దుండగులు ప్రవేశించడంపైనే ఇప్పటికీ దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.
భద్రత వైఫల్యానికి...
అయితే దేశ ప్రజలతో పాటు పార్లమెంటు సభ్యుల సందేహాలను పటాపంచలు చేయడానికి పోలీసులు రెడీ అవుతున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని సీన్ రీక్రియేట్ చేయాలని యోచిస్తున్నారు. సీన్ రీక్రియేషన్ చేస్తే అసలు గుట్టు బయటపడుతుందని, భద్రత వైఫల్యానికి బాధ్యులను గుర్తించడానికి వీలవుతుందని ఉన్నతాధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఎనిమిది మంది సెక్యూరిటీ సిబ్బందిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఇక విచారణలో పూర్తి స్థాయి బాధ్యత ఎవరిదన్న తేలితే వారిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.
రేపు, ఎల్లుండి...
అయితే పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో ఈరోజు వీలు కాదు. శని, ఆదివారాలు పార్లమెంటుకు సెలవులు కావడంతో ఆరోజు సీన్ రిక్రేయషన్ చేయవచ్చని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. అసలు పార్లమెంటులోకి ఆరుగురు దుండగులు చొరబడటం అంటే మామూలు విషయం కాదు. అదీ కలర్ స్మోక్ ను చేసే వాటిని ఎలా తేగలిగారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. వారంతా ఎటువంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేదు కాబట్టి సరిపోయింది. అదీ మారణాయుధాలు లేకపోవడం కూడా అంతే ఊరట ఇచ్చింది. కానీ లోపలికి ప్రవేశించడం మాత్రం ఎవరూ ఊహించనూ లేదు. దీంతో సీన్ రీక్రియేషన్ ద్వారా తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించనున్నారు.
గేటు వద్ద నుంచి...
అసలు పాస్ తీసుకున్న దగ్గర నుంచి పార్లమెంటు ప్రధాన ద్వారం వరకూ వచ్చిన తీరు.. ఆ తర్వాత చెకింగ్ పాయింట్ లో ఏం జరిగిందీ? ఆతర్వాత విజిటర్స్ గ్యాలరీలోకి ఎలా వెళ్లగలిగారు? అన్న దానిపై పోలీసులు విచారణ జరపపునున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగానే రెక్కీ నిర్వహించినట్లు తేలడంతో ఆరోజు ఏం చేశారన్నది కూడా పోలీసులు తమ సీన్ రీక్రియేషన్ లో తేల్చనున్నారు. ఇప్పటికే ఆరుగురు నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు. దీంతో సీన్ రీక్రియేషన్ ఎప్పుడు చేస్తారన్నది తెలియకున్నా.. అది చేస్తే తప్ప అసలు నిజాలు బయటకు రావు. అప్పుడే దేశ ప్రజల్లో నెలకొన్న సందేహాలకు ఫుల్ స్టాప్ పడే అవకాశముండదు.