టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌ పరీక్ష.. ఆన్ హోల్డ్

ప్రయోగ తేదీని తర్వాత ప్రకటిస్తామని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌

Update: 2023-10-21 03:57 GMT

గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌’ (టీవీ-డీ1) పరీక్షను నిలిపివేశారు. సాంకేతిక లోపం కారణంగా పరీక్షను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) హోల్డ్‌ లో పెట్టింది. ప్రయోగ తేదీని తర్వాత ప్రకటిస్తామని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వెల్లడించారు. ప్రయోగంలో సాంకేతిక సమస్య ఏర్పడిందని.. సమస్య ఎక్కడ వచ్చిందో గుర్తిస్తామన్నారు. ఈ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైంది. శనివారం ఉదయం 8.00 గంటలకు ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. తొలుత వాతావరణం అనూకూలించక 8.45 నిమిషాలకు రీషెడ్యూల్‌ చేశారు. అనంతరం చివరి నిమిషంలో సాంకేతిక లోపం కారణంగా పరీక్షను ఇస్రో శాస్త్రవేత్తలు హోల్డ్‌లో పెట్టారు.

గగన్‌యాన్‌ ప్రయోగాన్ని ఇస్రో 2025లో చేపట్టనుంది. అందులో భాగంగానే టీవీ-డీ1 పరీక్షను నిర్వహిస్తోంది. క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ సమర్థత, క్రూ మాడ్యూల్‌ పనితీరు, వ్యోమనౌకను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్‌ వ్యవస్థ పటిష్ఠతను పరిశీలిస్తుంది. సాగర జలాల్లో పడే క్రూ మాడ్యూల్‌ను సేకరించి, తీరానికి చేర్చనున్నారు. రాకెట్‌లో ఏదైనా లోపం ఉత్పన్నమైనప్పుడు వ్యోమగాముల ప్రాణాలను కాపాడడానికి వారు కూర్చొనే క్రూ మాడ్యూల్‌ను రాకెట్‌ నుంచి వేరు చేసి, సురక్షితంగా కిందకి తీసుకువచ్చే ప్రక్రియనే క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌(సీఈఎస్‌). దీన్ని ఈరోజు ఇస్రో పరీక్షించాలని అనుకోగా.. ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారు. మిగిలిన సమాచారం త్వరలోనే రానుంది.


Tags:    

Similar News