వేటు త‌ప్పింది.. మ‌ళ్లీ పార్ల‌మెంట్‌కు రాహుల్

రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరించబడింది. ఈ మేర‌కు రాహుల్ గాంధీపై ఉన్న అన‌ర్హ‌త వేటును తొల‌గిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది.

Update: 2023-08-07 06:16 GMT

రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరించబడింది. ఈ మేర‌కు రాహుల్ గాంధీపై ఉన్న అన‌ర్హ‌త వేటును తొల‌గిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 2023లో మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్య‌ల‌ కేసులో రాహుల్‌ను కోర్టు దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ క్ర‌మంలో లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్ పార్ల‌మెంట్ స‌భ్య‌త్వంపై అన‌ర్హ‌త వేటు వేసింది. గుజరాత్ హైకోర్టు తీర్పుపై రాహుల్ సుప్రీంను ఆశ్ర‌యించారు. ఆగస్టు 4న రాహుల్‌ శిక్షపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్ పై ఉన్న అన‌ర్హ‌త వేటును ఎత్తివేసింది. ఈ క్ర‌మంలో ఆయ‌న ప్ర‌స్తుతం జ‌రుగుతున్న లోక్‌స‌భ వ‌ర్షాకాల‌ స‌మావేశాల‌కు హాజ‌ర‌వ‌నున్నారు.

సుప్రీంకోర్టు స్టే కార‌ణంగా రాహుల్‌కి ఉపశమనం లభించింది. అయితే కోర్టు కేసును మాత్రం కొట్టివేయలేదు. ఈ వ్యవహారంపై విచారణ జరగనుంది. ఈ కేసులో సుప్రీంకోర్టు కూడా రాహుల్‌కి రెండేళ్లు శిక్ష విధించినట్లయితే.. ఆయ‌న‌ ఎన్నికల్లో పోటీకి అనర్హుడవుతారు. అయితే.. రాహుల్‌ను కోర్టు నిర్దోషిగా విడుదల చేసినా లేదా రెండేళ్లలోపు శిక్ష అనుభవించినా ఎన్నికల్లో పోటీ చేయగలుగుతారు. అయితే ఈ నిర్ణయం ఎప్పుడు వస్తుందో చూడాలి. 2024 ఎన్నికల తర్వాత కోర్టు నిర్ణయం వెలువడే అవకాశం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ 2024 ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.


Tags:    

Similar News