Next of Kin: దేశంలో నెక్స్ట్ ఆఫ్ కిన్ పై చర్చ

అమరవీరుడు కెప్టెన్ అన్షుమాన్ సింగ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తి చక్ర ప్రదానం

Update: 2024-07-13 05:55 GMT

అమరవీరుడు కెప్టెన్ అన్షుమాన్ సింగ్‌కు ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘కీర్తి చక్ర’ ప్రదానం చేశారు. ఆయన తల్లి మంజు సింగ్‌, అతని భార్య స్మృతి సింగ్ ఈ అవార్డును అందుకున్నారు. సియాచిన్‌లోని ఆర్మీ క్యాంపులో మంటలు చెలరేగడంతో డియోరియా నివాసి అన్షుమాన్ సింగ్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నలుగురు సహచరులను రక్షించి తన ప్రాణాలను కోల్పోయారు. అయితే అన్షుమాన్ తల్లిదండ్రులు రవి ప్రతాప్ సింగ్, మంజు సింగ్ కోడలిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కోడలు అవార్డు, ఎక్స్ గ్రేషియా తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయిందన్నారు.

'నెక్ట్స్ ఆఫ్ కిన్' అంటే తదుపరి కటుంబ సభ్యులు రూల్ ప్రకారం ఎక్స్ గ్రేషియాను కోడలు, ఆమె కుటుంబీకులు తీసుకున్నారన్నారు. తమ కోడలే ఫోటో ఆల్బమ్, బట్టలు, ఇతర జ్ఞాపకాలతో పాటు శౌర్య పురస్కారాన్ని కూడా తీసుకుందన్నారు. ఓ వ్యక్తి సైన్యంలో చేరినప్పుడు తల్లిదండ్రులు, సంరక్షులు పేర్లను నెక్ట్స్ ఆఫ్ కిన్ గా నమోదు చేస్తారు. అదే జవాను పెళ్లి అయిన తర్వాత ఆర్మీ నిబంధనల ప్రకారం తల్లిదండ్రులకు బదులుగా జీవితభాగస్వామిని నెక్ట్స్ ఆఫ్ కిన్ గా జాబితా చేస్తారు. ఈ నిబంధనలను మార్చాలని అన్షుమాన్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కొడుకు పోయిన తర్వాత నెక్ట్స్ ఆఫ్ కిన్ కింద కోడలికి బెనిఫిట్స్ అందాయని, పెళ్లయ్యి కేవలం ఐదు నెలలే అయ్యిందన్నారు. తల్లిదండ్రులైన తాము కీర్తి చక్ర గ్రహీతలు అయినప్పటికీ మా కొడుకు ఫోటో గోడకు వేలాడదీసి పూల మాలలు వేసుకుని స్మరించుకుంటున్నాం తప్పితే కనీసం పతకం కూడా ఇంట్లో లేదని బాధను వ్యక్తం చేశారు. నెక్ట్స్ ఆఫ్ కిన్ ప్రమాణాలను మార్చాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ను కూడా కోరామని అన్షుమాన్ తల్లిదండ్రులు తెలిపారు. అమరవీరుడి భార్యతో పాటు తల్లితండ్రులు కూడా నెక్ట్స్ ఆఫ్ కిన్ కు అర్హులయ్యేలా ప్రభుత్వం నిబంధనలను సవరించాలని ప్రతాప్ సింగ్ కోరారు.


Tags:    

Similar News