2000 రూపాయలు విరాళం ఇచ్చిన మోదీ

బీజేపీ విరాళాల ప్రచారాన్ని మార్చి 1న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు

Update: 2024-03-03 11:14 GMT

లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి 'పార్టీ ఫండ్' గా రూ. 2,000 విరాళంగా అందించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రతి ఒక్కరూ పార్టీకి విరాళాలు ఇచ్చి సహకరించాలని కోరారు. నమో యాప్ ద్వారా 'దేశ నిర్మాణానికి విరాళం' ప్రచారంలో భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ ట్విట్టర్ లో ప్రజలను కోరారు. నమో యాప్ ద్వారా రూ.2000 విరాళంగా ఇచ్చిన ఆయన అందుకు సంబంధించిన రసీదును సోషల్ మీడియాలో షేర్ చేశారు. వికసిత్ భారత్ నిర్మాణానికి మరింత వెన్నుదన్నుగా నిలిచేందుకు భారతీయ జనతా పార్టీకి సంతోషంగా విరాళం అందించానని తెలిపారు. దేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, నమో యాప్ ద్వారా విరాళాలు అందించాలని నరేంద్ర మోదీ కోరారు. నమో యాప్ ఫండింగ్ పేజ్ లింకును కూడా ప్రధాని మోదీ పంచుకున్నారు. నమో యాప్ ద్వారా రూ.5 నుంచి గరిష్ఠంగా రూ.2 వేల వరకు విరాళంగా ఇవ్వవచ్చని బీజేపీ తెలిపింది.

బీజేపీ విరాళాల ప్రచారాన్ని మార్చి 1న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు. ఆయన పార్టీకి రూ.1,000 విరాళం అందించారు. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ రూ. 719 కోట్ల నిధులను సేకరించగలిగింది. గత ఏడాదితో పోలిస్తే 17 శాతం వృద్ధిని సాధించిందని ఎన్నికల కమిషన్ డేటా వెల్లడించింది. 2021-2022లో పార్టీకి రూ. 614 కోట్ల విరాళాలు అందాయి. కాంగ్రెస్‌కు విరాళాలు 2021-2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 95.4 కోట్ల నుండి 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 79 కోట్లు తగ్గాయి.


Tags:    

Similar News