ఓడిపోయిన సర్పంచ్ కు లక్షలు.. కారు గిఫ్ట్
పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలయిన సుందర్ కు 11 లక్షల రూపాయల నగదుతో పాటుగా ఒక స్విఫ్ట్ డిజైర్ కారును బహుమతిగా ఇచ్చారు
ఎక్కడైనా ఎన్నికలలో ఓటమి పాలయితే ప్రజలు సానుభూతి వ్యక్తం చేయడం సహజమే. అయితే ఆ గ్రామస్థులు మాత్రం ఓడిపోయిన సర్పంచ్ కు ఏకంగా 11 లక్షల నగదును బహుకరించారు. దీంతో పాటు కారు, కొంత భూమిని కూడా బహుమతిగా ఇచ్చారు. హర్యానాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. హర్యానాలోని ఫతేహాబాద్ లోని నధోడి గ్రామ పంచాయతీకి ఎన్నికలకు జరిగాయి.
ఒక్క ఓటు తేడాతో..
ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన సుందర్ నరేందర్ లు పోట ీచేశారు. అయితే ఈ ఎన్నికల్లో సుందర్ ఓటమి పాలయ్యారు. మొత్తం 4,416 ఓట్లు పోల్ కాగా సుందర్ కు 2,200 ఓట్లు రాగా, నరేందర్ కు 2,201 ఓట్లు వచ్చాయి. కేవలం ఒక్క ఓటు తేడాతో మాత్రమే సుందర్ ఓటమి పాలయ్యారు. అయితే సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలయిన సుందర్ ను గ్రామస్థులు నిరాశపర్చ దలచుకోలేదు.
భూమి కూడా...
ఓటమి పాలయిన సుందర్ కు 11 లక్షల రూపాయల నగదుతో పాటుగా ఒక స్విఫ్ట్ డిజైర్ కారును బహుమతిగా ఇచ్చారు. దీంతో పాటు కొంత భూమిని కూడా నజరానాగా ఇచ్చారు. ఎందుకిలా ఇచ్చారంటే సుందర్ గెలవాల్సిందని ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలు కావడంతో తాము ఆయనను సన్మానించుకున్నామని గ్రామస్థులు తెలిపారు. దీంతో ఓడిపోయినా గ్రామస్థుల మదిలో చోటు దక్కడమే కాకుండా బహుమతులు కూడా దక్కడంతో సుందర్ హ్యాపీ గా ఫీలవుతున్నారు.