ఎంపీదే నిర్ణయమా?

చింతలపూడి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాను ఈసారి మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి

Update: 2023-09-29 05:34 GMT

గత కొంతకాలంగా ఏలూరు వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ రాజకీయాల పట్ల అనాసక్తితో ఉన్నారని... వచ్చే ఎన్నికలలో ఆయన పోటీకి దూరంగా ఉంటున్నారు అన్న ప్రచారం బయటికి వచ్చింది. దివంగత మాజీ మంత్రి.. 40 సంవత్సరాలు పాటు మెట్ట ప్రాంతంలో రాజకీయాలు చేసిన కోటగిరి విద్యాధరరావు రాజకీయ వారసుడుగా ఎన్నో ఆశలు అంచనాలతో రాజకీయాల్లోకి వచ్చారు శ్రీధర్. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయటం.. ఆ ఎన్నికలలో ఏకంగా 1,65,000 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించి పార్లమెంటు సభ్యుడు కావటం చకచకా జరిగిపోయాయి. తండ్రితో పోలిస్తే శ్రీధర్ ది విభిన్నమైన మనస్తత్వం. వివాదాలకు దూరంగా ఉంటారు. రాజకీయ ప్రత్యర్థులను కూడా తనతో కలుపుకోవాలని చూస్తూ ఉంటారు.

వైరాగ్యంలో...
అలాంటి శ్రీధర్ ఎందుకు ? రాజకీయ వైరాగ్యం చూపించారు అన్నది చాలామందికి అందు పట్టడం లేదు. గత ఎన్నికలలో పారిశ్రామికవేత్తగా తన వ్యాపారాలు కూడా చాలా వరకు వదులుకొని ఎంపీగా విజయం సాధించారు. త‌న తండ్రిలా ప్రజాసేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాల‌ని.. త‌మ‌ను న‌మ్ముకున్న వారితో పాటు త‌న ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల‌న్నదే ఆయ‌న ఆకాంక్ష. అయితే తాను ఎంపీగా ఉన్నా అవేవి నెర‌వేర‌క‌పోవ‌డంతో ఆయ‌న‌లో తీవ్ర నిరుత్సాహం వ‌చ్చేసింది. శ్రీధర్ నాలుగున్నర యేళ్లు ఎంపీగా ఉన్న ఆయన అభివృద్ధి పరంగా తన సొంత నియోజకవర్గంలోనూ తనదైన ముద్ర వేయలేకపోయారు. తాను కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి ఎంపీ అయినా.. అవినీతి మ‌కిలికి దూరంగా ఉన్నా త‌న ల‌క్ష్యం నెర‌వేర‌క‌పోవ‌డం ఆయ‌న మ‌న‌స్సును బాగా క‌ష్టపెట్టింది.
గ్రూపు రాజకీయాలను...
40 సంవత్సరాలుగా తమ కుటుంబాన్ని నమ్ముకుని ఉన్న నాయకులు... కేడర్‌కు చిన్నచిన్న పదవులు ఇప్పించుకునేందుకు కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. గత ఎన్నికలకు ముందు తమతో కలిసి ఉన్న ఎలిజా ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించటం.. చివరకు అభివృద్ధి విషయంలో కూడా ఎంపీ గ్రూపును పక్కన పెడుతూ రావడం శ్రీధర్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. చిన్న చిన్న పదవుల విషయంలో కూడా ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు పెద్దపెద్ద పంతాలకు పోయిన పరిస్థితి. చివరకు స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ నుంచి చాలా చోట్ల ఎమ్మెల్యే తన వర్గం నేతలను పోటీకి పెట్టిన కూడా ఎంపీ వర్గం పై చేయి సాధించింది. అభివృద్ధి లేకుండా ఈ తరహా రాజకీయాలు చేయటం ఇష్టం లేని శ్రీధర్ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని ముందు అనుకున్నారు.
మిథున్ రెడ్డి ఎంట్రీతో...
అయితే శ్రీధర్ కు అత్యంత ఆప్తుడు అయిన వైసిపి కింగ్ మేకర్ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రంగంలోకి దిగి శ్రీధర్ వచ్చే ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేలా ఒప్పించారు. ఈ క్రమంలోనే ఈసారి శ్రీధర్ కుటుంబాన్ని న‌మ్ముకున్నోళ్లకు.. ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించిన పార్టీ కేడర్ కు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని.. ఈసారి గ్రూపుల గోల లేకుండా చూస్తానని స్వయంగా హామీ ఇచ్చారు. ఈసారి శ్రీధర్ సొంత నియోజకవర్గం చింతలపూడి అసెంబ్లీ టికెట్‌ శ్రీధర్ కు చెప్పిన వారికి ఇస్తానని హామీ కూడా ఇచ్చారు. దీంతో మెత్తబడ్డ శ్రీధర్ వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీకి రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికలలో చింతలపూడి అసెంబ్లీ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థిని శ్రీధర్ డిసైడ్ చేస్తారన్నది దాదాపు క్లారిటీ వచ్చేసింది. అయితే శ్రీధర్ మదిలో ఎవరు ? ఉన్నారన్నది మాత్రం అంతుపట్టటం లేదు. శ్రీధర్ తో పాటు నియోజకవర్గ రాజకీయాలలో కీలకంగా వ్యవహరించే మరో పార్టీ నేత కలిసి ఈసారి చింతలపూడి వైసీపీ అభ్యర్థిని డిసైడ్ చేస్తారన్నది స్థానికంగా పార్టీ క్యాడర్‌కు తెలిసిన విషయమే. ఇప్పటికే వైసీపీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు అయితే శ్రీధ‌ర్‌ను.. అటు ఆ కీలక నేతను కలిసి ఈసారి తమకు సీటు వచ్చేలా చేయాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.
ఓ అధికారి...
అయితే బలమైన సామాజిక నేపథ్యంతో పాటు వైసీపీ కీలక నేతకు బంధుత్వం ఉన్న ఓ ప్రభుత్వ అధికారి పేరు ప్రాథమికంగా చర్చికి వస్తున్నట్టు తెలుస్తోంది. సదరు వ్యక్తి అయితే ఇటు నియోజకవర్గానికి స్థానిక నేత కావడంతో పాటు.. ఆయనకు ఉన్న స్థానిక పరిచయాలు.. ఆర్థిక అంగ బ‌లాలు.. పుష్కలంగా ఉండటం.. ఇటు శ్రీధర్ వర్గం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ఏడాది చివర్లో చింతలపూడి వైసిపి అభ్యర్థి విషయంలో అధిష్టానం ఓ క్లారిటీ అయితే ఇచ్చేయనుందని తెలుస్తోంది..
Tags:    

Similar News