Revanth Reddy : ప్రతి అడుగూ బీఆర్ఎస్ ను వెనక్కు నెట్టేందుకు.. పట్టుబిగిస్తున్న రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాష్ట్ర సలహా మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. త్వరలో రాష్ట్ర సలహా మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సలహా మండలి ఛైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి కొనసాగనున్నారు. సలహా మండలిలో మేధావులకు చోటు కల్పించాలని నిర్ణయించారు. జయప్రకాశ్ నారాయణ, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, ఆకునూరి మురళి ప్రొఫెసర్లు హరగోపాల్, నాగేశ్వరరావులను నియమించే అవకాశముందని తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే రేవంత్ రెడ్డి కొందరితో సలహా మండలిపై చర్చించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై ఉత్తర్వులు వెలువడనున్నాయని తెలుస్తుంది.
సలహా మండలి ద్వారా...
ఈ సలహా మండలి ప్రభుత్వానికి వివిధ అంశాలపై ముఖ్యమైన సూచనలు చేయనుంది. గురుకులాలు, మండల స్థాయిలో ఏర్పాటు చేసే విషయంతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్స్‌పై పర్యవేక్షణ వంటివి సలహామండలికి అప్పజెప్పాలని నిర్ణయం చేసినట్లు తెలిసింది. దీనివల్ల పాలనలో పారదర్శకత చోటు కల్పించడమే కాకుండా.. నిర్ణయాలు కూడా ప్రజామోదం పొందేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడానికి ఈ తరహా నిర్ణయాలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
తేడా చూపించడానికే...
అంతేకాకుండా గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను వీలయినంత త్వరగా ప్రజలకు అర్థమయ్యేందుకు సలహా మండలిని ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు రేవంత్ రెడ్డి వచ్చినట్లు తెలిసింది. గత పాలనలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఎవరినీ నిర్ణయాలు తీసుకోవడంలోనూ, అమలులోనూ భాగస్వామ్యులను చేసే వారు కాదని, తాము అధికారంలోకి రాగానే మేధావులతో పాటు అన్ని వర్గాలను కలుపుకుని పోతున్నామన్న సంకేతాలను బలంగా ప్రజల్లోకి పంపేందుకు రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.
నిర్ణయాల్లోనూ....
దీనివల్ల ప్రజల్లో పార్టీ పట్ల మాత్రమే కాకుండా తన నాయకత్వంపై కూడా విశ్వాసం పెరుగుతందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం కూడా ప్రతిపక్షాలు తప్పుపట్టలేనంత విధంగా ఉండాలని, అందుకోసమే మేధావులు, ప్రొఫెసర్లతో తెలంగాణ అభివృద్ధితో పాటు పేద ప్రజలకు సంక్షేమం అందించే విషయంలో వారిని ఇన్‌వాల్వ్ చేయాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంగా తెలుస్తుంది. ఇదే అమలయితే రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లే అవుతుంది. ప్రజల్లోకి బలంగా వెళ్లగలగడానికి ఈ తరహా నిర్ణయాలు ఉపయోగపడతాయని పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు.