ఎవరిది ధర్మ పోరాటం ? ఎవరిది వంచన ?

Update: 2018-04-30 03:30 GMT

హోదా మైలేజ్ కోసం గోదాలోకి దిగిన టిడిపి, వైసిపిలు పోటా పోటీ కార్యక్రమాలతో ప్రజలను అలరించేందుకు సిద్ధం అయ్యాయి. టిడిపిది ధర్మపోరాటం టైటిల్ అయితే, వైసిపిది వంచన టైటిల్. అయితే వీరి పోరాటంలో విభిన్నమైన శైలి కనిపించనుంది. ఒకరు తిరుపతి వెంకన్న సాక్షిగా కార్యక్రమం మరొకరు విశాఖ వేదికగా నిరసన ప్లాన్ చేశారు. ఇక టిడిపి ప్రధాని మోడీని, వైసిపి అధినేత జగన్ ను టార్గెట్ చేయనుంది. ఇక వైసిపి వంచన దీక్ష పేరుతో మోడీ, చంద్రబాబు లను టార్గెట్ చేస్తూ నిర్వహిస్తున్నారు. ఇరు పార్టీల లక్ష్యం ఒక్కటే. తామే ఈ రాష్ట్ర ప్రజల కోసం అహరహం పరితపిస్తున్నామని చెప్పడం.

హైటెక్ గానే అన్ని ...

రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవేముంది. అధికార పార్టీ తిరుపతి సభ ను తమ్ముళ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలోని ఒక్కో నియోజకవర్గం నుంచి 10 వేలమంది కి తగ్గకుండా జనసమీకరణలో నేతలు తలమునకలయ్యారు. వందల సంఖ్యలో ప్రయివేట్, ఆర్టీసీ బస్సులను ధర్మ పోరాటం సభకు వచ్చే జనాలకు వినియోగించనున్నారు. వారికి తాగునీరు, మజ్జిగా వంటి ఏర్పాట్లు భారీగానే చేస్తున్నారు. అధికార గణం అంతా టిడిపి పార్టీ క్యాడర్ తో మమేకమై పనిచేసుకుపోతుంది.

వంచన లో ప్రత్యేకం నలుపే ...

విశాఖ అంతా నలుపుమయం అయ్యేలా వైసిపి ప్లాన్ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడిన మాట తప్పాయంటూ నల్ల జెండాలు, నల్లబ్యాడ్జీలు, నలుపు చొక్కాలు టీ షార్ట్ లతో వైసిపి శ్రేణులు డ్రెస్ కోడ్ పాటించి తమ నిరసన తెలియ చేస్తాయి. ఈ కార్యక్రమం విజయవంతానికి వైసిపి అగ్రనేతలు విస్తృత ఏర్పాట్లు సాగించారు. దాదాపు 12 గంటల పాటు వంచన వ్యతిరేక నిరసన దినం కొనసాగనుంది.

మీరు దొంగలు ... కాదు మీరే దొంగలు ...

హోదా కోసం పోరులో టిడిపి వైసిపిలు ఒక పార్టీపై మరో పార్టీ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. మీరు దొంగలంటే కాదు మీరే దొంగలని తీవ్ర స్థాయిలో విమర్శల దాడి కొనసాగిస్తున్నాయి. తాజాగా టిడిపి తరుపున మంత్రులు దేవినేని ఉమా, గంట శ్రీనివాసరావు జగన్ టార్గెట్ గా ఆరోపణలు గుప్పించారు. ఇక వైసిపి నుంచి రోజా ధీటుగా వీరికి కౌంటర్లు విసిరారు. మొత్తానికి వీరిద్దరి కార్యక్రమాలపై మాత్రం జనంలో జోరుగా చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఏపీలో ప్రజలు ఎవరి నిరసన ను నమ్ముతారో చూడాలి.

Similar News