ఈ దేశ ప్రజలను మార్చడం ఎవరివల్లా కాదా?

Update: 2017-01-28 20:00 GMT

రాజకీయ విమర్శల సంగతి పక్కనపెడదాం... ఎనభై రోజుల డిమోనిటైజేషన్ తర్వాత...ఎన్నిలక్షల కోట్ల నల్లధనం పట్టుబడింది? ఎంత నకిలీ కరెన్సీ చెల్లుబాటు నిలిచిపోయింది? ఎన్ని రోజుల పాటు ఎన్నికోట్ల మంది రోజువారీ కూలీలు రోడ్డున పడ్డారు? వ్యవస్థలో ఎంత పారదర్శకత వచ్చింది? వంటి సంగతులనూ పక్కనపెడదాం. కానీ ప్రజల్లో పరివర్తన ఎంతమేరకు వచ్చిందన్న అంశాన్ని మాత్రం పట్టించుకోవాలి. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలో తీసుకున్న అతిపెద్ద సంస్కరణగా డీమోనిటైజేషన్ ను పేర్కొంటున్నారు. మొదట్లో ప్రధాని నల్లధనానికి చెల్లుచీటి అంటూ ఎన్ని చెప్పినా.. ఈ చర్య లక్ష్యం నగదు రహిత, లేదా తక్కువ నగదు చెలామణి ఆర్థిక వ్యవస్థను ప్రజల్లో పెంపొందించడమేనంటూ తాజాగా సర్కారే చెబుతోంది. అందుకే ఆ లెక్కల లోగుట్టు లోతుగా పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన గణాంకాల అసలు రూపం బయటపడుతోంది. ఈ ప్రజలను మార్చడం ఎవరివల్లా కాదంటూ ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకోవాల్సిన స్థితి కనిపిస్తోంది.జనవరి నెలలో కొద్దికొద్దిగా డబ్బు చెలామణి పెరిగింది. బ్యాంకుల వద్ద క్యూలు తగ్గిపోయాయి. ఏటీఎంలు ఎనభైశాతం పైగా పనిచేస్తున్నాయి. కావాల్సిన డబ్బుకు కొరత తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రజలు అలవాటైన పద్ధతిలోనే క్యాష్ ను పెళపెళలాడిస్తున్నారు. రోజురోజుకీ క్యాషలెస్ లావాదేవీలు లెస్ అయిపోతున్నాయి.

డిసెంబరు నెలతో పోలిస్తే జనవరిలో క్యాష్ లెస్ లావాదేవీల సంఖ్య 44 శాతం పడిపోయింది. డిసెంబరు నెలలో దేశంలో క్యాష్ లెస్ లావాదేవీలు 31 కోట్లకు పైగా సాగాయి. జనవరిలో ఇప్పటివరకూ వీటి సంఖ్య 19 కోట్లకే పరిమితమైంది. డిసెంబరు నుంచి జనవరి నెలను తీసుకుంటే మొబైల్ బ్యాంకింగు, మొబైల్ వ్యాలెట్ , ఆర్టీజీఎస్, నెఫ్ట్ వంటి ఎలక్ట్రానిక్ నిధుల మార్పిడి వ్యవహారాలు సైతం 28 శాతం మేరకు పడిపోయాయి. ఆర్టీజీఎస్ నిధుల బదలాయింపులు 88 లక్షల నుంచి 65 లక్షలకు తగ్గిపోయాయి. నెఫ్ట్ లావాదేవీల సంఖ్య 16 కోట్ల నుంచి 11 కోట్లకు పడిపోయింది. మొబైల్ ద్వారా సాగే నగదు వ్యవహారాలు డిసెంబరులో 7 కోట్లకుపైగా ఉండగా, జనవరిలో 28 వ తేదీనాటికి 5 కోట్లకే పరిమితమైంది. మొత్తమ్మీద చూస్తే ప్రభుత్వం బలవంతంగా రుద్దాలని చూసిన ఎలక్ట్రానిక్ క్యాష్ ట్రాన్స్ఫర్ వ్యవహారం ఆశించిన ఫలితాలు ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. ఫిబ్రవరి, మార్చి నాటికి మళ్లీ అక్టోబర్ నెలనాటి యథాతథ పరిస్థితికి దాదాపు వచ్చే అవకాశమే ఎక్కువని బ్యాంకింగు, ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే శుష్కప్రయాస..శూన్యప్రయోజనం అన్న నానుడి కేంద్రసర్కారుకు అతికినట్లు సరిపోతుంది.

ఏ వ్యవస్థలో అయినా ఎంతోకొంత లాభం ఉంటేనే ప్రజలు కొత్తదనాన్ని ఆహ్వానిస్తారు. అందులోనూ ఎన్నో ఏళ్లుగా అలవాటు పడిన నగదు ఆర్థిక వ్యవస్థను మళ్లించి మానసికంగా మరో కొత్త లోకంలోకి ప్రజలను నడిపించాలంటే ఆర్థిక ప్రయోజనం కనిపించాలి. డెబిట్, క్రెడిట్, కార్డుల ద్వారా, మొబైల్ యాప్ ల ద్వారా చేసే చెల్లింపుల్లో అటువంటి ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు. ఇప్పటికే అమ్మకం పన్ను,సేవా పన్ను, అనేక రకాల కేంద్ర,రాష్ట్ర పన్నులను చెల్లిస్తున్న పౌరునిపై నగదు రహిత లావాదేవీ చేసినందుకు అదనంగా మరో రెండు శాతం మేరకు పన్ను పడుతోంది. అందువల్లనే ప్రజలు ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినా వినియోగించుకొనేందుకు ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. పైపెచ్చు కార్డు లావాదేవీల్లో ఏదేని లోపం జరిగితే సరిదిద్దే వ్యవస్థ కూడా అందుబాటులో లేదు. అటు బ్యాంకింగు వర్గాలు కానీ, సర్కారు కానీ ఇందుకు జవాబుదారీతనం చూపడం లేదు. అనేక సందర్భాల్లో వినియోగదారుని కార్డు నుంచి డబ్బు చెల్లించినట్లు చూపినా... వ్యాపారి ఖాతాలో జమకావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బ్యాంకులు ఫిర్యాదులను స్వీకరించి న్యాయం చేసేందుకు బాధ్యత తీసుకోవడం లేదు. దీంతో ఇంకా ఈ వ్యవస్థ విశ్వసనీయత పొందలేకపోతోంది. ఒకవేళ ప్రభుత్వానికే చిత్తశుద్ధి ఉంటే ...ఎలక్ట్రానిక్ లావాదేవీలపై అదనపు పన్నులను వెంటనే తొలగించాలి. నగదు బదిలీల్లో లోపం ఏర్పడితే వెంటనే సరిదిద్దేలా చూడాలి. సంబంధిత బ్యాంకులు బాధ్యత వహించేలా ఆదేశాలు ఇవ్వాలి. అంతేకాకుండా డెబిట్, క్రెడిట్ కార్డులు, మొబైల్ యాప్ ల ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులకు అమ్మకం పన్ను, సేవాపన్నుల్లో కొంత మినహాయింపు ఇచ్చే సదుపాయం కూడా కల్పించాలి. అప్పుడు ప్రభుత్వం ప్రచారం చేయక్కర్లేదు ప్రజలే ముందుకొచ్చి ఈ మార్పును ఆహ్వానించి సక్సెస్ చేస్తారు. పారదర్శక ఆర్థిక వ్యవస్థ వస్తుంది. రానున్న కాలంలో పన్నుల రాబడి పెరుగుతుంది. దీర్ఘకాల లాభాలను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా కొంతకాలం పన్ను నష్టాలను భరిస్తే ఆశించిన ప్రయోజనం సిద్ధిస్తుంది. సర్కారు వారు ఇందుకు సిద్ధమా? అవ్వాకావాలి? బువ్వా కావాలి? అనుకుంటే మాత్రం రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలిపోవడం ఖాయం. ఇప్పటికే ఆ సూచనలు కనిపిస్తున్నాయి. పూల నుంచి మకరందాన్ని గ్రోలే తుమ్మెద మాదిరి సుతిమెత్తగా , నొప్పి తెలియకుండా పాలకులు ప్రజల నుంచి పన్ను వసూలు చేసుకోవాలంటాడు ప్రాచీన భారత ఆర్థికవేత్త కౌటిల్యుడు.. అదే సర్వకాల,సర్వావస్థల్లోనూ పాలకులకు ప్రామాణికం. కాదని ప్రజలను బండగా బాదేద్దామనుకుంటే భంగపాటు తప్పకపోవచ్చు...

Similar News