Video: బీఆర్‌ఎస్‌లో చేరికపై రాజాసింగ్ క్లారిటీ
తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నేతల అసంతృప్తి, ఇతర పార్టీల్లో చేరికలు
హైదరాబాద్: తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నేతల అసంతృప్తి, ఇతర పార్టీల్లో చేరికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ బీఆర్‌ఎస్ చేరవచ్చని పుకార్లు వచ్చాయి. ఇవాళ ఎమ్మెల్యే రాజాసింగ్.. మంత్రి టి.హరీశ్ రావు నివాసానికి వెళ్లిన నేపథ్యంలో ఆయన అధికార బీఆర్‌ఎస్‌లో చేరవచ్చనే ఊహాగానాలకు దారితీసింది. అయితే, బీజేపీ తనపై సస్పెన్షన్‌ను ఎత్తివేయకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న వార్తలకు రాజా సింగ్ చెక్ పెట్టారు. హరీష్‌రావును కలిసిన అనంతరం రాజాసింగ్ ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. అందులో తాను చనిపోయే వరకు బీజేపీతోనే ఉంటానని చెప్పారు.
బీజేపీ తన సస్పెన్షన్‌ను ఎత్తివేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. కానీ పార్టీని వీడను అని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టులో ఇస్లాం మతంపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో బిజెపి ఎమ్మెల్యే సస్పెండ్ అయ్యారు. బీజేపీ వేటు వేసిన తర్వాత.. రాజాసింగ్ కొంతకాలం సైలెంట్‌గా ఉన్నారు. ఆ తర్వాత టీడీపీలో చేరనున్నరనే వార్తలు వచ్చాయి. అయితే తాను టీడీపీలో చేరడం లేదని ఆ వార్తలను రాజాసింగ్ ఖండించారు.తాను బీజేపీని వీడనని, మరే ఇతర రాజకీయ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై చర్చించేందుకు, తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కోరేందుకు హరీశ్‌రావుతో సమావేశమైనట్లు రాజాసింగ్ తెలిపారు.