Telangana : కేబినెట్ విస్తరణ ఇప్పటికైనా జరుగుతుందా భయ్యా?

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుంది. డిసెంబరు 7వ తేదీనాటికి ఏడాది పూర్తవుతుంది.

Update: 2024-11-25 12:12 GMT

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుంది. డిసెంబరు 7వ తేదీనాటికి ఏడాది పూర్తవుతుంది. అయితే ఇప్పటి వరకూ మంత్రివర్గ విస్తరణ జరగలేదు. వరసగా ఏదో ఒక సాకులు చెబుతూ పార్టీ హైకమాండ్ మంత్రి వర్గ విస్తరణను వాయిదా వేసుకుంటూ వస్తుంది. తొలుత నామినేటెడ్ పదవులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పార్టీ నాయకత్వం కేబినెట్ విస్తరణకు మాత్రం ఏడాది నుంచి అనుమతి ఇవ్వలేదు. ఒకసారి హర్యానా, కాశ్మీర్ ఎన్నికలు అని వాయిదా వేసింది. మళ్లీ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత అంటూ అదే పాట పాడుతూ మంత్రి వర్గ విస్తరణకు ఢిల్లీలోని పెద్దలు మోకాలడ్డారు. దీంతో అనేకమంది ఆశావహులు డీలా పడ్డారు.

ఆరు ఖాళీలు…

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అయినా కేబినెట్ విస్తరణకు అనుమతి ఇస్తుందా? లేదా? అన్న సందేహం నేతల్లో నెలకొని ఉంది. ఎందుకంటే తర్వాత ఢిల్లీ శాసనసభకు ఎన్నికలున్నాయి. ఇలా వరసగా ఏదో ఒక ఎన్నికలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సార్లు ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలసి మంత్రి వర్గ విస్తరణకు అనుమతి ఇవ్వాలని కోరారు. తెలంగాణ మంత్రివర్గంలో ఇంకా ఆరు స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. అనేక మంది మంత్రి పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కొన్ని జిల్లాలకు కేబినెట్ లో చోటు దక్కలేదు కూడా.

దసరాకే అని చెప్పినా…

ఈ పరిస్థితుల్లో హైకమాండ్ మళ్లీ మరో మెలిక పెడుతుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత విస్తరణ చేపట్టాలని హైకమాండ్ చెప్పినా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. దసరాకే మంత్రి వర్గ విస్తరణ జరగాల్సి ఉన్నప్పటికీ అనేక కారణాలను సాకుగా చూపి వాయిదా వేసుకుంటే నేతల ఆశలపై హైకమాండ్ నీళ్లు చల్లుగుతంది. మంత్రి వర్గ విస్తరణ రాష్ట్ర స్థాయి నేతల చేతుల్లో లేదు. జాతీయ పార్టీ కావడంతో ఢిల్లీ పెద్దలు ఓకే చెబితేనే విస్తరణ చేపట్టాల్సి ఉంది. కానీ అందుకు ముహూర్తం మాత్రం ఇంకా కుదరడం లేదు.

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతేనా?

అయితే డిసెంబరు 7వ తేదీన మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని మరో ప్రచారం ఇటీవల కాలంలో ఊపందుకుంది. మహారాష్ట్ర ఎన్నికలు పూర్తి కావడంతో కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేదా? అన్న అనుమానం మాత్రం నేతల్లో లేకపోలేదు. స్థానికసంస్థల ఎన్నికల తర్వాత అంటే మాత్రం మళ్లీ డీలా పడతారు హస్తం పార్టీ నేతలు. అలాగని మంత్రి వర్గ విస్తరణ చేపడితే మంత్రి పదవులు దక్కని వాళ్లలో అసంతృప్తి పెరిగి స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం చూపుతుందన్న అనుమానం కూడా రాష్ట్ర నేతల్లో ఉంది. అందుకే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలయినప్పటికీ మంత్రి వర్గ విస్తరణ విషయంలో మాత్రం వాయిదా పడదన్నగ్యారంటీ ఏమీ లేదని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కూడా మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు అన్నది చెప్పలేకపోతున్నారు. మొత్తం మీద అధికారంలోకి వచ్చి ఏడాది అయినా పూర్తి స్థాయి మంత్రి వర్గం లేకపోవడమేంటన్న కామెంట్స్ సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.



Tags:    

Similar News