Pawan Kalyan : పవన్ ను ఢిల్లీకి పంపడంలో ఆంతర్యమేంటి? వ్యూహంలో భాగమేనా?

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు తగ్గించి ఆ బాధ్యతలను తన పార్ట్ నర్ పవన్ కల్యాణ్ కు అప్పగించినట్లు కనపడుతుంది

Update: 2024-11-26 07:31 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలు తగ్గించి ఆ బాధ్యతలను తన పార్ట్ నర్ పవన్ కల్యాణ్ కు అప్పగించినట్లు కనపడుతుంది. ఒకరకంగా చంద్రబాబు వ్యూహంలో భాగంగా పవన్ ను ఢిల్లీకి పంపి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో వేగిరంగా అడుగులు పడేందుకు ఒకింత ఆలోచన చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఏపీలో ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత వరసగా చంద్రబాబు ఢిల్లీ బాట పట్టారు. ఆయన అనేక సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించారు. కొంత వరకూ నిధులను సాధించగలిగారు.

వరసగా ఢిల్లీకి వెళ్లి...
ప్రధానంగా రాజధాని అమరావతికి నిధులను పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి పొందడంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతిని సంపాదించగలిగారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలోనూ పురోగతి ఉండేలా చూడగలిగారు. కొత్త విమానాశ్రయాలను ఏర్పాటుపై కూడా అనుకున్నది చేసుకోగలిగారు. దీంతో పాటు విశాఖ రైల్వే జోన్ విషయంలోనూ ముందడుగు పడింది. విశాఖ రైల్వే జోనల్ కార్యాలయానికి సంబంధించి టెండర్లను కూడా రైల్వే శాఖ నుంచి నోటిఫికేషన్ తెప్పించగలిగారు. ప్రతి సారీ తానే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలపై ఒత్తిడి పెంచడం సరికాదని భావించిన చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ కు ఢిల్లీ బాధ్యతలను అప్పగించినట్లే కనిపిస్తుంది.
సత్సంబంధాలుండటంతో...
పవన కల్యాణ్ కు బీజేపీ పెద్దలతో సత్సంబంధాలున్నాయి. మహారాష్ట్రలో చేసిన ఎన్నికల ప్రచారంతో పవన్ కల్యాణ్ మోదీతో పాటు కేంద్ర మంత్రులకు కూడా మరింత చేరువయ్యారు. ఆయన సేవలను త్వరలో జరిగే ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఉఫయోగించుకోవాలని చూస్తుంది. అందుకే పవన్ కల్యాణ్ ను ఢిల్లీకి పంపి పని చక్కబెట్టాలని చంద్రబాబు ఆలోచించినట్లు తెలిసింది. అందులో భాగంగానే నిన్న స్పీకర్ ఓం బిర్లా ఇంట్లో వివాహానికి హాజరైన పవన్ కల్యాణ్ నేడు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై పవన్ చర్చిస్తున్నారు. దీంతో పాటు అదానీ వ్యవహారంలో ఏం చేయాలన్న దానిపై కూడా బీజేపీ ముఖ్యనేతలతో పవన్ చర్చించే అవకాశాలున్నట్లు కనపడుతుంది.
అదానీతో ఒప్పందంపై...
అదానీతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. దీనిపై బీజేపీ పెద్దల ఆలోచన ఏంటన్నది పవన్ కల్యాణ్ ద్వారా అడిగి తెలుసుకుని తర్వాత ఆ దిశగా అడుగులు వేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది. రేపు మోదీతో సమావేశమైన తర్వాత అదానీ ఒప్పందాలపై పవన్ కల్యాణ్ ఒక క్లారిటీ తీసుకునే అవకాశముందని తెలిసింది. ప్రభుత్వం ఏర్పాటయిన తొలినాళ్లలో ఢిల్లీకి దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ ఇటీవల తరచూ ఢిల్లీకి వెళుతుండటం వెనక చంద్రబాబు ఆలోచనలే కారణమంటున్నారు. బీజేపీ పెద్దలను మెప్పించి, ఒప్పించి ప్రాజెక్టులను తెప్పించుకోవడంలో పవన్ కల్యాణ్ సాయం చంద్రబాబు తీసుకున్నట్లే కనిపిస్తుంది.


Tags:    

Similar News