Ys Sharmila : ప్రయోగం చేస్తే సరిపోతుందిగా.. ప్రత్యేకంగా పోయేది ఏముంటుంది?
వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలను అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఈరోజు, రేపట్లో ప్రకటన వెలువడనుంది
కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిపోయారు. ఆమె ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో ఇప్పుడు వైఎస్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో ఎలాంటి బాధ్యతలను అప్పగిస్తారన్న చర్చ మొదలయింది. ఈరోజు, రేపట్లో ఏఐసీసీ నుంచి ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆమెకు ఏ బాధ్యతలను అప్పగించాలన్న దానిపై సీనియర్ నేతల నుంచి ఇప్పటికే ఏఐసీసీ అభిప్రాయాలను సేకరించిందని చెబుతున్నారు. వారి అభిప్రాయం మేరకు వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ లో ముఖ్యమైన పదవిని కట్టబెట్టే అవకాశాలున్నాయని తెలిసింది.
జెండా పట్టుకునేందుకు...
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగై పోయింది. నేతలు, క్యాడర్ కూడా జగన్ వెంట వెళ్లిపోయారు. అరకొర నేతలు మాత్రమే మిగిలారు. క్యాడర్ కూడా పెద్దగా లేదు. మళ్లీ మొదటి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా రాలేదంటే దాని పరిస్థితిని వేరే చెప్పనక్కర లేదు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు కూడా హస్తం గుర్తువైపు చూడటం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడానికే పదేళ్ల నుంచి కార్యకర్తలు భయపడే పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు.
ముగ్గురిని మార్చినా...
అలాంటి పరిస్థితుల్లో పదేళ్లలో ముగ్గురు పీసీసీ చీఫ్ లను మార్చింది. తొలుత రఘవీరారారెడ్డిని బీసీ సామాజికవర్గం కోటాలో నియమించింది. తర్వాత ఎస్‌సీ సామాజికవర్గం కోటాలో సాకే శైలజానాధ్ ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసింది. అయినా ఏం లాభం లేదు. ఒక్క ఓటు కూడా పెరగలేదు. ఒక్కరూ శాసనసభలో అడుగుపెట్టలేకపోయారు. ఈపరిస్థితుల్లో కొంత కాలం క్రితం గిడుగు రుద్రరాజును అధినాయకత్వం పీసీసీ చీఫ్ గా నియమించినా పార్టీ లో పురోగతి లేదు. ఇవన్నీ గమనించిన అధినాయకత్వం మరో ప్రయోగానికి సిద్ధమవుతుంది. ఏమీ లేని చోట ఎంతో కొంత సాధించడమే గొప్ప అని పార్టీ హైకమాండ్ కూడా భావిస్తున్నట్లుంది.
షర్మిలకు పగ్గాలిస్తే...?
అందుకే వైఎస్ షర్మిలకు పీసీీసీ పగ్గాలు ఇవ్వడానికే డిసైడ్ అయినట్లు తెలిసింది. తొలుతు స్టార్ క్యాంపెయినర్ గా బాధ్యతలు ఇవ్వాలనుకున్నా, ప్రచారంలో తన సోదరుడిపై విమర్శలు చేయడంపై పార్టీకి కూడా కొన్ని అనుమానాలున్నాయి. స్థానిక సమస్యలను ప్రస్తావించి వెళ్లిపోతే తామేమీ చేయలేరు. అందుకే షర్మిలమ్మను ఫిక్స్ చేయాలని పార్టీ హైకమాండ్ భావిస్తుంది. అందుకోసం పీసీసీ చీఫ్ బాధ్యతలను అప్పగిస్తే నేతలను పార్టీలోకి తెచ్చే పని నుంచి ప్రచారం వరకూ షర్మిల కాంగ్రెస్ కు ఉపయోగపడుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఈరోజు, రేపట్లో ఏఐసీసీ నుంచి అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలిసింది.