Ys Jagan : జగన్ కు టీడీపీయే సానుభూతి తెచ్చిపెడుతుందా?

జగన్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ మళ్లీ సానుభూతి పుష్కలంగా తెచ్చిపెట్టే ప్రయత్నం టీడీపీ నేతలు చేస్తున్నారు

Update: 2024-11-22 08:36 GMT

తెలుగుదేశం పార్టీ నేతల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. జగన్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ మళ్లీ సానుభూతి పుష్కలంగా తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పిస్తుంది. అసెంబ్లీ సమావేశాల వేదికగా గత కొద్ది రోజుల నుంచి జగన్ ను లక్ష్యంగా చేసుకుని తిట్టిపోస్తున్న టీడీపీ నేతల వ్యాఖ్యలతో జగన్ గ్రాఫ్ మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ సంగతి గతంలో అనేకసార్లు జరిగిన ఎన్నికల్లో స్పష్టమయినప్పటికీ ఇప్పటికీ టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల వైఖరితో మార్పు లేదు. గతంలో జరిగిన ఫలితాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నప్పటికీ నేతలు తమ వ్యవహార శైలిని మార్చుకోదలచుకోలేదు.

టీడీపీ నేతలు అత్యుత్సాహంతో…

మంత్రులు తమ పదవులను కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేలు మంత్రి పదవులు పొందడానికి జగన్ ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తమ పార్టీ అధినేత మెప్పు పొందేందుకు చేసే ప్రయత్నాల్లో భాగంగా జగన్ ను తిట్టిన తిట్టకుండా తిడుతుండటంతో ప్రజల్లో ఒకరకమైన సానుభూతిని మళ్లీ పొందుతున్నారనిపిస్తుంది. ఒకవైపు జగన్ ను ఒంటరిని చేసి మూడు పార్టీలు కలసి తమ నేతను వేధిస్తున్నాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలను నమ్మే అవకాశాలను కొట్టిపారేయలేమనిపిస్తుంది. దుర్మార్గుడు, దద్దమ్మ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రజలు హర్షించడం లేదన్నది గుర్తుంచుకుంటే మంచిదన్న సూచనలు వినపడుతున్నాయి.

2019 ఎన్నికలకు ముందు కూడా…

2019 ఎన్నికలకు ముందు కూడా జగన్ లక్ష కోట్ల అవినీతి చేశారంటూ టీడీపీ పెద్దయెత్తున ప్రచారం చేసింది. అదే సమయంలో దేశరాజధాని ఢిల్లీ నుంచి గల్లీ స్థాయి వరకూ జగన్ పై దుమ్మెత్తి పోసినా పెద్దగా ప్రయోజనం లేకుండాపోయింది. ఆ ఎన్నికల్లో జనం 151 అసెంబ్లీ స్థానాలను వైసీపీకి కట్టబెట్టిన విషయాన్ని టీడీపీ నేతలు మర్చిపోతున్నారు. జగన్ పై వ్యక్తిగత దూషణలు మాని, రాజకీయ విమర్శల వరకూ పరిమితమైతే జనం కొంత వరకూ హర్షిస్తారు తప్పించి అవినీతి, తల్లీ, చెల్లి అంటూ వెంటపడితే, ఎక్కడ పడితే అక్కడ విమర్శలు చేస్తుంటే జనంలో సానుభూతి మరింత పెరిగి జగన్ కు ప్లస్ అవుతుందన్నది విశ్లేషకుల అంచనాగా వినిపిస్తుంది.

పదవుల కోసమేనా?

ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీల గురించి మాత్రం చెప్పకుండా జగన్ ను లక్ష్యంగా చేసుకుని వ్యవహరించడం వల్ల ప్రయోజనం ఏముందన్నది టీడీపీ నేతలే కొందరు చర్చించుకుంటున్నారు. కేవలం కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ ను తిట్టి పదవులను పొందాలనుకుంటున్నారని, అది సుదీర్ఘకాలంలో కూటమి పార్టీలకే నష్టమని వారు ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి జగన్ గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకించవచ్చు. వాటిని ప్రస్తావించవచ్చు. కానీ పదే పదే రాష్ట్రంలో సమస్యలను వదిలేసి ఇలా జగన్ మీద పడి విమర్శలు చేస్తే జగన్ కు వచ్చే నష్టం కన్నా, టీడీపీకే ఎక్కువ నష్టం జరుగుతుందని గ్రహించాలని పలువురు సీనియర్ నేతలు సయితం అభిప్రాయ పడుతున్నారు. కానీ టీడీపీ నేతలను ఆపేదెవరు?





Tags:    

Similar News