ఫుల్ క్లారిటీతో వైఎస్ జగన్
ఏపీలో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచే అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.
ఏపీలో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచే అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. పొత్తులు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా వైసీపీని అధికార పీఠం నుంచి దించాలని ప్రతిపక్షాలు ప్రణాళికలు రచిస్తుంటే.. మరోసారి ప్రజల సపోర్టుతో ఎలాగైనా గెలిచేందుకు వైసీపీ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అధికార వైసీపీ సంక్షేమ పథకాలతో ప్రజల దగ్గరికి వెళ్తోంది. వైసీపీని గద్దె దించేందుకు చేస్తున్న ప్రయత్నాల విషయంలో ప్రతిపక్షాలకు క్లారిటీ లేకపోయింది. ఇప్పటి వరకు పొత్తులపై ఎలాంటి స్పష్టత రాలేదు. అలాగే ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై కూడా క్లారిటీ లేదు. ప్రతిపక్ష పార్టీ నేతలు రెండు చోట్ల పోటీ చేసే ఛాన్స్ ఉందని వారి మాటలను బట్టి తెలుస్తోంది.
ఇక ఇదే విషయాన్ని లక్ష్యంగా చేసుకుని వైసీపీ నాయకులు ప్రతిపక్షాలపై కామెంట్లు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని, తమకు ప్రజలతోనే పొత్తు ఉంటుందని వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. అయితే ఈ పొత్తుల విషయమై ప్రతిపక్షాల్లో ఏ క్లారిటీ లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికే తమ పార్టీ విధానం, నినాదం ఒక్కటేనని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. జనులంతా ఒకే కుటుంబం జనమంతా ఒకే నిలయమని పేర్కొన్నారు. ప్రజలే తమ అసలు బలమని, తాము సింగిల్‌గానే ఎన్నికలకు వెళ్తామని సీఎం జగన్ ఇప్పటికే తెలిపారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను మళ్లీ అధికారంలో కూర్చోబెడతాయని వైఎస్ జగన్ ఆత్మ విశ్వాసంతో ఉన్నారు.
తాజాగా ప్రతిపక్షాలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు. వైసీపీ ఎలా ఓడించాలో తెలియక ప్రతిపక్షాలు తలలు పట్టుకుంటున్నాయని, ప్రతిపక్ష నేతలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియట్లేదని విమర్శించారు. తమ ప్రభుత్వ పాలనలో ఏమైనా లోపాలు, అవకతవకలు జరిగినట్టు ఆధారాలు ఉంటే ప్రతిపక్ష నేతలు వెలికి తీయొచ్చన్నారు. మరోవైపు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడంపై పార్టీ నేతలు శ్రద్ధ చూపించాలని వైఎస్ జగన్ ఇప్పటికే సూచించారు. ముఖ్యంగా, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల్లో పొత్తులపై క్లారిటీ లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఎన్నికలకు తొమ్మిది నెలలు మాత్రమే వ్యవధి ఉంది. దీంతో వైసీపీ అనేక రకాలైన సర్వేలు చేయిస్తోంది. ఓవరాల్ గా చూస్తే జగన్ ఎన్నికల యుద్ధానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.