రైతులను అవమానించేలా.. కాంగ్రెస్ విధానం: కేటీఆర్
24×7 ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో కాంగ్రెస్, టీపీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ, కాంగ్రెస్ పార్టీ
హైదరాబాద్: 24×7 ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో కాంగ్రెస్, టీపీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానం చిన్న, సన్నకారు రైతులను అవమానించేలా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. సన్నకారు రైతుల సంక్షేమాన్ని ఆ పార్టీ ఎప్పుడూ విస్మరిస్తూనే వస్తోందని, సన్నకారు రైతుల పట్ల సవతి తల్లి దృక్పథాన్ని అవలంభిస్తోందన్నారు.
రాష్ట్రవ్యాప్త నిరసనల రెండవ రోజు బుధవారం కేటీఆర్ మాట్లాడుతూ.. చిన్న, సన్నకారు రైతులకు మూడు గంటల విద్యుత్ సరఫరా అంటే.. వారు తమ పొలాలకు తగినంత నీరు సరఫరా చేయడానికి బాహుబలి మోటార్లను ఉపయోగించాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. నిన్నటి వరకు ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తానన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు వ్యవసాయానికి మూడు గంటలు కరెంట్ చాలు అంటున్నాడని మండిపడ్డారు. గతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని దండగా అన్నాడని.. ఇప్పుడు చోటా చంద్రబాబు నాయుడు (రేవంత్ రెడ్డి) మూడు పూటలు దండగ అంటున్నాడని సెటైర్ వేశారు.
రైతులకు ఏడు గంటల కరెంట్ ఇవ్వలేకపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 24 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. అరికాలిలో మెదడు ఉన్నోళ్లను నమ్ముకుంటే రైతుల బతుకు ఆగమవుతుందన్నారు. మరోసారి రాబందు 3 గంటల మాటెత్తితే రైతుల చేతిలో మాడు పగలడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే రైతు సమాజం కష్టాల్లో కూరుకుపోతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. రైతుల అదృష్టాన్ని మార్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కావాలా?, వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతుందని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు కావాలా? అని రాష్ట్ర ప్రజలను కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్షా సమయం అన్నారు.