Grandhi Srinivas : గ్రంథి పార్టీని వీడటానికి మెయిన్ రీజన్ అదేనా?

భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు.

Update: 2024-12-13 06:56 GMT

భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ ఆయన పార్టీని వీడేందుకు మాత్రం స్పష్టమైన కారణం ఉందని చెబుతున్నారు. గ్రంథి శ్రీనివాస్ వైసీపీలో ముఖ్యమైన నేత. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపు భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. అయినా గ్రంథి శ్రీనివాస్ కు మాత్రం జగన్ కేబినెట్ లో చోటు దక్కలేదు. అయినా పార్టీనే నమ్ముకుని ఉన్నారు. దీంతో పాటు భీమవరాన్ని జిల్లా కేంద్రంగా చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పాలి. జగన్ కూడా మంచి ప్రయారిటీ ఇస్తూ వచ్చారు.

ప్రయారిటీ ఇచ్చినా...
అందుకే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చినప్పటికీ గ్రంథి శ్రీనివాస్ విషయంలో మాత్రం జగన్ మనసు మార్చుకోలేదు. ఆయననే మరోసారి అభ్యర్థిగా పోటీకి దింపారు. అంతేకాదు గ్రంథి శ్రీనివాస్ ను భీమవరంలో జరిగిన సిద్ధం సభలో ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ వేరే ఏ పార్టీకి వెళ్లినా పెద్దగా రాజకీయంగా ప్రయోజనం లేదనే చెప్పాలి. ఎందుకంటే టీడీపీలో బలమైన నేతలు భీమవరంలో ఉన్నారు. జనసేనకు వెళదామనుకున్నప్పటికీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు ఉన్నారు. ఆయనకు మిగిలింది ఒకటే ఒక ఆప్షన్. అది ఇక కూటమిలోని మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ మాత్రమే.
బీజేపీలో చేరితే...
భారతీయ జనతా పార్టీలో చేరితే కొంత వరకూ ఉపయోగంతో పాటు పొత్తులో భాగంగా టిక్కెట్ దక్కే ఛాస్స్ ఉందని అంచనాలు వినపడుతున్నాయి. నరసాపురం ఎంపీ టిక్కెట్ మొన్నటి ఎన్నికల్లో పట్టుబట్టి బీజేపీ సాధించుకుని శ్రీనివాసరాజును అభ్యర్థిగా పోటీకి దింపింది. శ్రీనివాసరాజు గెలిచి కేంద్ర మంత్రిగా కూడా అయ్యారు. దీంతో గ్రంథి శ్రీనివాస్ చూపు కమలం పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. బీజేపీలో అయితే సులువుగా తన రాజకీయ భవిష్యత్ బాగుంటుందని భావిస్తున్నారు. అదే సమయంలో బీజేపీలో అయితే తనకు టిక్కెట్ విషయంలో పోటీ కూడా తక్కువగా ఉంటుందన్న అంచనాలో ఉన్నారు.
ఐటీ దాడులే కారణమని...
మరొక ముఖ్యమైన కారణం వైసీపీని వీడటానికి ఆదాయపు పన్నుశాఖ దాడులు అని చెబుతున్నారు. గ్రంథి శ్రీనివాస్ ఇళ్లపై గత నెలలో ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగాయి. భీమవరంలో ఏడు ప్రాంతాల్లోనూ, ప్రకాశం జిల్లాలోని ఆయన ఆక్వా ఫ్యాక్టరీపై దాడులు జరిగాయి.చెన్నై నుంచి వచ్చిన ఐటీ శాఖ అధికారులు ఈ దాడులు చేశారు. పలు డాక్యుమెంట్లు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గ్రంథి శ్రీనివాస్ వ్యాపార భాగస్వామ్యుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు జరిగాయి. బీజేపీలో చేరితే వీటి నుంచి బయట పడవచ్చన్న అభిప్రాయం కూడా ఆయనలో కనపడుతుందని చెబుతున్నారు. వైసీపీ అధినేత జగన్ పై వ్యతిరేకత కన్నా ఐటీ దాడుల భయంతోనే ఆయన పార్టీని వీడినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు


Tags:    

Similar News