TDP : రాబోయే రోజులన్నీ ఇక టీడీపీవే.. ఇది ఫిక్స్

ఆంధ్రప్రదేశ్ లో ఇక ఎన్నిక వచ్చినా అది టీడీపీ ఖాతాలో పడిపోతుంది. రాజ్యసభలో మళ్లీ తెలుగుదేశం పార్టీ సభ్యులు వస్తున్నారు.

Update: 2024-12-11 08:32 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఇక ఎన్నిక వచ్చినా అది టీడీపీ ఖాతాలో పడిపోతుంది. రాజ్యసభలో మళ్లీ తెలుగుదేశం పార్టీ సభ్యులు వస్తున్నారు. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో రెండు స్థానాలు దక్కించుకుని చాలా రోజుల తర్వాత ప్రాతినిధ్యం సంపాదించుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత టీడీపీ రాజ్యసభలో ఖాళీ అయింది. ఉన్న నేతలు కొందరు బీజేపీలోకి వెళ్లారు. చివరకు పదవీ కాలం పూర్తి కావడంతో రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ జీరో నెంబరుకు పడిపోయింది. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో తక్కువ స్థానాలను సాధించడంతో రాజ్యసభ స్థానాలను దక్కించుకోలేకపోయింది. దీంతో కొన్ని నెలల పాటు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యంలేకుండా పోయింది. ఇది గతంలో ఎన్నడూ జరగని విషయం కావడంతో ఒకింత విమర్శలను కూడా ఆ పార్టీ అధినేత నుంచి ముఖ్య నాయకత్వం వరకూ ఎదుర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ 1983లో ఎన్టీఆర్ సారథ్యంలో ఆవిర్భవించిన తర్వాత ఎన్నడూ లేని విధంగా కేవలం గత ఎన్నికల్లో 26 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

మూడు ఏకగ్రీవమే…

తాజాగా రాజ్యసభకు మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. దానికి నోటిఫికేషన్ వెలువడింది. మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు టీడీపీ, ఒకటి బీజపీ పంచుకున్నాయి. వైసీపీ నుంచి గత ప్రభుత్వంలో ఎన్నికయిన రాజ్యసభ్యులు మోపదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యలు వైసీపీతో పాటు తమరాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. మూడు రాజ్యసభ స్థానాల్లో తిరిగి ఆర్. కృష్ణయ్యను బీజేపీ, బీద మస్తాన్ రావుతో పాటు సానా సతీష్ ను టీడీపీ ఎంపిక చేసింది. అంటే ఇప్పుడు రాజ్యసభలో ఇద్దరు టీడీపీ సభ్యులు త్వరలో కాలుమోపబోతున్నారు. అంటే కొన్ని నెలల తర్వాత ప్రాతినిధ్యం టీడీపీకి రాజ్యసభలో లభిస్తుంది. మూడు రాజ్యసభ స్థానాలకు ముగ్గురు మాత్రమే నామినేషన్లు వేయడం, వైసీపీ పోటీకి దూరంగా ఉండటంతో ఇక ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లే. అందుకే చాలా రోజుల తర్వాత మళ్లీ పెద్దల సభలో తెలుగుదేశం పార్టీ వాయిస్ వినిపించబోతుంది.
వచ్చే ప్రతి ఎన్నికలోనూ…
అయితే దానిని అధిగమించి 2024 ఎన్నికల్లో కూటమి సర్కార్ 164 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఇక ఖాళీ అయ్యే ప్రతిరాజ్యసభ స్థానం కూడా కూటమి పార్టీలకే చెందుతాయి. వైసీపీకి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే ఉండటంతో 2029 లో జరిగే ఎన్నికల వరకూ జరిగే ప్రతి ఎన్నిక కూటమి పరమవుతుంది. అంటే ఏపీలో ఖాళీ అవుతున్న ప్రతి రాజ్యసభ స్థానం అది తమ ఖాతాలో వేసుకుంటుంది. అయితే మూడు పార్టీలు ఉండటంతో కొంత స్థానాలను పంచుకోవాల్సి ఉంటుంది కనుక తెలుగుదేశం పార్టీ గతంలో మాదిరిగా ఎక్కువ స్థానాలను తీసుకునే అవకాశం లేకపోవచ్చు. అదే సమయంలో ఖాళీ అవుతున్న ప్రతి రాజ్యసభ స్థానంలో సింహభాగం మాత్రం టీడీపీకి దక్కుతాయన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే కూటమిలో అతి పెద్ద పార్టీ టీడీపీయే కాబట్టి దానికే ఎక్కు వ స్థానాలు దక్కుతాయి. సో.. రానున్న కాలమంతా ఇక టీడీపీదేనన్న మాట.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now



Tags:    

Similar News