Jawahar : ఈసారి సీటు ఎక్కడో.. ఎక్కడా ఖాళీగా లేదే.. బలమైన వాయిస్‌ కు టిక్కెట్ సమస్య

మాజీ మంత్రి కె.జవహర్ కు టెన్షన్ పట్టుకుంది. కొవ్వూరు టీడీపీ నేతలు తమకు ఆయన వద్దే వద్దంటున్నారు

Update: 2024-02-01 14:07 GMT

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో టిక్కెట్లు ఆశించే వారు టెన్షన్ లో ఉన్నారు. చివరి నిమిషంలో తమ పేరు లిస్ట్‌ నుంచి గల్లంతవుతుందేమోనన్న భయంతో ఉన్నారు. వైసీపీలో ఇప్పటికే ఐదు జాబితాలు విడుదలయ్యాయి. ఇంకా ఆ పార్టీలో అభ్యర్థుల మార్పులు, చేర్పులపై కసరత్తు కొనసాగుతూనే ఉంది. అయితే ఇదే పరిస్థితి ఇప్పుడు టీడీపీలోనూ ఉంది. అనేక మందికి ఈసారి టిక్కెట్లు దక్కవనే అభిప్రాయం నెలకొంది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నేతల టెన్షన్ అయితే మామూలుగా లేదు. తమకు టిక్కెట్ వస్తుందా? రాదా? అన్న సందేహం ప్రతి నేతలోనూ ఉంది. జనసేనతో పొత్తులో ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

చంద్రబాబు కసరత్తులు...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు ప్రారంభించారు. జనసేనకు ఎన్ని టిక్కెట్లు ఇవ్వాలి? ఏ ఏ స్థానాలు కేటాయించాలన్న దానిపై ఆయన సమాలోచనలు జరుపుతున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన ఉండే అవకాశముంది. ఈ నెల 4వ తేదీ నుంచి చంద్రబాబు, పవన్ కల్యాణ‌్ లు ప్రజల చెంతకు వెళుతుండటంతో అంతకంటే ముందుగానే పోటీ చేసే స్థానాలపై ఒక అవగాహనకు వస్తే మంచిదని రెండు పార్టీల అగ్రనేతలు భావిస్తున్నారు. అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ఎక్కువ స్థానాలను అడుగుతున్నా, తమకు పట్టున్న స్థానాన్ని వదులుకునేందుకు మాత్రం చంద్రబాబు కూడా సిద్ధంగా లేరు. పొత్తుతో నియోజవర్గాన్ని వదులుకుంటే క్షేత్రస్థాయిలో భవిష‌్యత్ లో పార్టీ మరింత బలహీనమవుతుందని ఆయన భావిస్తున్నారు.
తీర్మానం చేసి పంపాలని...
ప్రస్తుతం కొవ్వూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కె. జవహర్ పరిస్థిితి కూడా అంతే. ఆయనకు ఎక్కడ టిక్కెట్ కేటాయించాలన్న దానిపై ఇప్పటి వరకూ తేలలేదంటున్నారు. కొవ్వూరు నేతలు జవహర్ తమకు వద్దు పొమ్మంటున్నారు. జవహర్ కు కాకుండా వేరే ఎవరికి టిక్కెట్ ఇచ్చినా తాము గెలుపు కోసం సహకరిస్తామని చెబుతున్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా తీర్మానం చేసిన కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీ అధినాయకత్వానికి పంపాలని నిర్ణయించారు. దీంతో జవహర్ పరిస్థితి అటు కాకుండా ఇటు కాకుండా పోయింది. 2014 ఎన్నికల్లో కె. జవహర్ తిరువూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. అనుకోకుండా ఆయన మంత్రి కూడా అయ్యారు. దీంతో ఆయన పంట పండినట్లయింది. తొలిసారిగా ఎన్నికయి మంత్రి సీటులో కూర్చున్న జవహర్ లోకల్ లీడర్స్ ను లెక్క చేయలేదు.
గత ఎన్నికల్లో మార్చినా...
దీంతో 2019 ఎన్నికలకు వచ్చే సరికి స్థానిక నాయకులు జవహర్ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బలమైన కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలు వ్యతిరేకించడంతో చంద్రబాబు కూడా ఆయనను తిరువూరుకు షిఫ్ట్ చేశారు. అక్కడ ఓటమి పాలయ్యారు. తిరువూరుకు ఇప్పుడు ఇన్‌ఛార్జిగా దేవదత్తును నియమించారు. అయితే జవహర్ ను మాత్రం రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా నియమించారు. కానీ ఇప్పుడు తాజాగా మరొకసారి స్థానిక నాయకులు బలంగా అసమ్మతి గళం వినిపించడంతో జవహర్ ను ఎక్కడికి పంపుతారా? అన్న చర్చ జరుగుతుంది. గోపాలపురం పంపుతారన్న ప్రచారమయితే ఉంది. మరో రిజర్వ్‌డ్ నియోజకవర్గానికి పంపుతారా? లేక ఆయన సీటు గల్లంతవుతుందా? అన్న చర్చ సైకిల్ పార్టీలో యమ స్పీడ్ గా వైరల్ అవుతుంది. మరి ఏమవుతుందో చూడాలి మరి.


Tags:    

Similar News