జగన్ అలా గెలిస్తే ... ఉత్తుత్తి సర్వేలంటున్న విపక్షం

ఎన్నికల వేళ సర్వేలు వస్తుంటాయి. అయితే వాటిలో వాస్తవమెంత? నిజంగానే అంత సీనుందా? అన్న చర్చ జరుగుతోంది.

Update: 2023-10-03 06:35 GMT

ఎన్నికల వేళ సర్వేలు వస్తుంటాయి. అయితే వాటిలో వాస్తవమెంత? నిజంగానే అంత సీనుందా? లేకుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు అనుగుణంగా ఉన్నాయా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏ పార్టీకి ఆ పార్టీలు ప్రయివేటు సంస్థలు ద్వారా సర్వేలు చేయించుకుంటూ ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంటాయి. ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుంటుంటాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రజల ఆలోచనల వరకూ పరిగణనలోకి తీసుకుని తమ వైఖరిలోనూ నిర్ణయాల్లోనూ మార్పులు తీసుకొస్తాయి. ఇది ఎక్కడైనా సాధారణమే. అందులో ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో ఈసారి మరింత ఎక్కువగా ఉంటుంది.

ప్రతి నెల సర్వే...
అధికార వైసీపీ ప్రతి నెల ప్రశాంత్ కిషోర్ టీం ద్వారా సర్వేలు చేయించుకుంటుంది. ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతతో పాటు అక్కడ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందన్న దానిపై నివేదికలు తెప్పించుకుంటూ అధికార పార్టీ ముందుకు వెళుతుంది. అందుకే జగన్ ఈసారి కొందరు సిట్టింగ్‌లకు సీట్లు దక్కడం కష్టమేనని చెప్పారు. అయినా అధికారంలోకి వస్తే వారికి ఏదో ఒక పదవి ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రతి నెల సర్వే చేయించుకుంటున్న జగన్ నియోజకవర్గాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. నేతల మధ్య విభేదాలు పార్టీకి ఇబ్బందికరంగా మారతాయని సర్వేల్లో తెలియడంతో దానికి శ్రీకారం చుట్టారు.
టీడీపీ కూడా...
ఇక విపక్ష తెలుగుదేశం పార్టీ కూడా అంతే. సర్వేల ప్రకారమే చంద్రబాబు ఇప్పటి వరకూ కొన్ని స్థానాలకు ఇన్‌చార్జులను ప్రకటించారు. ఉత్తరాంధ్రతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాలిడ్ విక్టరీని కొడితే అధికారంలోకి వస్తామని అంచనా వేస్తున్న చంద్రబాబు టీం అక్కడే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇక టీడీపీకి తోడు జనసేన కూడా కలవడంతో ఇక్కడ మెజారిటీ సీట్లు తమవేనన్న ధీమా ఆ పార్టీలో కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలంగా మార్చుకోవడంలో మరింత ముందడుగు వేయాలని చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో జైలుకెళ్లేముందు నిర్ణయించారు. జైలుకు వెళ్లడంతో తనపై అక్రమ కేసులు బనాయించారని ప్రజలు నమ్మి మరింతగా తమను జనం ఆదరిస్తారన్న నమ్మికతో సీబీఎన్ టీం ఉంది.
నిజమా? కాదా?
అయితే తాజాగా టైమ్స్ నౌ సర్వేలో వన్ సైడ్ రిజల్ట్ రావడంతో మళ్లీ సర్వేలపై చర్చ జరుగుతుంది. సాధారణంగా ప్రస్తుతం ఏపీలో ఎవరూ తన మనసులో మాటను బయటకు చెప్పలేని పరిస్థిితి. ఏ పార్టీకి ఆ పార్టీకి విడిపోయిన వారు మాత్రం నిర్భయంగా తమ అభిప్రాయాలను సర్వే సంస్థలకు చెబుతున్నారు తప్పించి అసలు ఓటర్లు మాత్రం మౌనంగానే ఉంటున్నారు. కొందరు మనకెందుకులే అని సర్వే సంస్థల ప్రతినిధుల ప్రశ్నలకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో తటస్థ ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. సర్వేలు తమకు అనుకూలంగా వచ్చిన పార్టీల్లో జోష్ నింపుతుండగా, ప్రత్యర్థి పార్టీల్లో మాత్రం కొంత నిరాశ చోటు చేసుకుంటుంది. నిజంగా ఈసర్వేల్లో నిజముందా? లేక ఏ పార్టీకి చెందిన కార్యకర్తల అభిప్రాయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారా? అన్న చర్చ జరుగుతుంది. మరి సర్వే రిజల్ట్ నిజమా? కాదా? అన్నది ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే తెలియనుంది.
.


Tags:    

Similar News