TDP : ఇన్‌ఛార్జి నియామకంతో చింత‌ల‌పూడి టీడీపీ చింత‌లు తీరేనా? సీటు ముందు స‌వాళ్లెన్నో

మూడున్నర సంవ‌త్సరాలుగా స‌స్పెన్స్ రేపిన చింత‌ల‌పూడి టీడీపీ ఇన్‌చార్జ్‌గా సొంగా రోష‌న్ కుమార్ నియ‌మితులయ్యారు

Update: 2024-02-21 11:46 GMT

ఎట్టకేల‌కు మూడున్నర సంవ‌త్సరాలుగా ఎంతో స‌స్పెన్స్ రేపిన ఏలూరు జిల్లా చింత‌ల‌పూడి ( ఎస్సీ) రిజ‌ర్వ్‌డ్ సీటు టీడీపీ ఇన్‌చార్జ్‌గా సొంగా రోష‌న్ కుమార్ నియ‌మితులయ్యారు. ఆయనను చింతలపూడి ఇన్ ఛార్జిగా నియమిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన క‌ర్రా రాజారావు అనారోగ్యంతో మృతిచెందాక నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ప‌గ్గాల కోసం చాలా మంది ప్రయత్నం చేస్తూ వ‌చ్చారు. చివ‌ర‌కు రోష‌న్‌తో పాటు బొమ్మాజీ అనిల్, ఆకుమ‌ర్తి రామారావు పేర్లు మాత్రమే రేసులో నిలిచాయి. గ‌త నెల రోజులుగా ఎవ‌రికి ఇన్‌చార్జ్ ప‌గ్గాలు వ‌స్తాయ‌న్న ఉత్కంఠ ఎక్కువ కాగా ఈ రోజు ఆ స‌స్పెన్స్‌కు తెర‌దించుతూ రోష‌న్‌కు ఇన్‌చార్జ్ ప‌గ్గాలు ఇచ్చేశారు.

రాజకీయ నేపథ్యం లేకున్నా...
రోష‌న్‌కు అంత‌కుముందు రాజ‌కీయ నేప‌థ్యం లేదు. నియోజ‌క‌వ‌ర్గంలోని లింగ‌పాలెం మండ‌లం ధ‌ర్మాజీగూడెంకు చెందిన ఆయ‌న గ‌త కొన్నేళ్లుగా మిష‌న్ హోప్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గంతో పాటు ఏలూరు పార్లమెంటు ప‌రిధిలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వ‌స్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో సీటు ఆశించినా అప్పట్లో స‌మీక‌ర‌ణ‌లు సెట్ కాలేదు. ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మి త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గంలో సేవా కార్యక్రమాలు మ‌రింత‌గా విస్తృతం చేశారు.
కరోనా సమయంలో...
క‌రోనా టైంలో రోష‌న్ మిష‌న్ హెప్ టీం ద్వారా చేసిన కార్యక్రమాలు, ఆక్సిజ‌న్ సేవ‌లందించ‌డం వంటివి ఈ ప్రాంత ప్రజలను ఆకట్టుకున్నాయి. ఇక మూడేళ్లుగా పార్టీ కేడ‌ర్‌కు ట‌చ్‌లో ఉండ‌డంతో పాటు పార్టీ కార్యక్రమాల‌కు ఇతోధికంగా సాయం చేయ‌డం.. గ‌త ఏడాది కాలంగా పార్టీకి ఆర్థిక సహాయ‌స‌హ‌కారాలు భారీగా అందించ‌డం చేస్తూ వ‌స్తున్నారు. ఎట్టకేల‌కు రక‌ర‌కాల ఆలోచ‌న‌ల త‌ర్వాత రోష‌న్‌కు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ప‌గ్గాలు అప్పగించారు చంద్రబాబు.
సీటు ఓకే... స‌వాళ్లెన్నో...
సీటు విష‌యంలో గ‌ట్టి పోటీ ఎదుర్కొని సొంతం చేసుకున్న రోష‌న్ ముందు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీలో చాలా స‌వాళ్లే ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా చింత‌ల‌పూడి ఎస్సీల‌కు రిజ‌ర్వ్ అయ్యాక ప్రతి ఎన్నిక‌కు ఓ నేత మారిపోతూ వ‌స్తున్నారు. గ‌త మూడు ఎన్నిక‌ల్లో 2009లో క‌ర్రా రాజారావు, 2014లో పీత‌ల సుజాత‌, 2019లో తిరిగి క‌ర్రా రాజారావు పోటీ చేశారు. రాజారావు రెండుసార్లూ పోటీ చేసినా గెల‌వ‌లేదు. సుజాత గెలిచి మంత్రి అయినా నియోజ‌క‌వ‌ర్గంపై ఆమెకు ప‌ట్టులేదు. నియోజ‌క‌వ‌ర్గ టీడీపీలో కేడ‌ర్ ప‌టిష్టంగా ఉన్నా ఈ 15 ఏళ్లలో ఎప్పుడూ గ్రూపులుగా చీలిపోతూ వ‌స్తోంది. వీరిని స‌మ‌న్వయం చేయ‌డం పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్నవాళ్లకు క‌త్తిమీద సాములా మారింది.
గ్రూపుల గోల...
పీత‌ల సుజాత మంత్రిగా ఉన్నా కూడా ఈ గ్రూపుల‌కు అడ్డుకట్ట వేయ‌లేక‌పోయారు. ఆమెను త‌ప్పించాక ఇప్పుడు కూడా నియోజ‌క‌వ‌ర్గంలో గ్రూపుల గొడవ మ‌రింత ఎక్కువైంది. మాట మాట్లాడితే ఎంపీ గ్రూపు ఒక‌టి, ఎమ్మెల్యే గ్రూపు ఒక‌టి.. వీళ్లతో సంబంధం లేని మ‌రో గ్రూపు అంటూ చింత‌ల‌పూడి టీడీపీలో గ్రూపుల గోల ఎప్పుడూ ఎక్కువే. ఒక‌రి ఇంటికి వెళ్లినా.. ఒక నేత‌తో కాస్త ఎక్కువ స్నేహం చేసినా మిగిలిన వాళ్లకు కోపం వ‌చ్చేస్తుంటుంది. రోష‌న్ కూడా ఏ ఒక్క నాయ‌కుడికో లేదా గ్రూపుకో ప్రాధాన్యత ఇవ్వ‌కుండా అంద‌రిని స‌మ‌న్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకువెళితేనే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ప్లస్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ విష‌యంలో రోష‌న్ అడుగులు ఎలా ? ఉంటాయో చూడాలి.


Tags:    

Similar News