పరువు పోయిందిగా

తెలంగాణ భారతీయ జనతా పార్టీ కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లుంది. వారు తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు అద్దం పడుతున్నాయి

Update: 2023-09-15 04:37 GMT

తెలంగాణ భారతీయ జనతా పార్టీ కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లుంది. వారు తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు అద్దం పడుతున్నాయి. చేరికలు లేవని బాధపడుతూ ఎవరినంటే వారిని పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతుండటం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ బీజేపీ మొన్నటి వరకూ బలంగా ఉండేది. బీఆర్ఎస్ ను ఎదుర్కొనేది బీజేపీ అన్నంత బిల్డప్ ఇచ్చింది. అది భ్రమ అని తేలింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకోవడంతో బీజేపీ చాలా దూరం వెనకబడి పోయిందనే చెప్పాలి. నాలుగేళ్లు ముందు వరకూ రన్నింగ్ రేసులో రెండో స్థానంలో ఉందని పించుకున్న బీజేపీ గోల్ రీచ్ అయ్యే సమాయానికి మాత్రం అలసటతో చతికలపడిందనే చెప్పాలి.

బలహీనతేనా?
అందుకు వారు తీసుకుంటున్న హడావిడి నిర్ణయాలు.. ఆ తర్వాత మార్పులు పార్టీ నేతల బలహీనతను చాటి చెబుతున్నాయి. చీకోటి ప్రవీణ్, కృష్ణ యాదవ్ లను పార్టీలో చేర్చుకునేందుకు అగ్ర నేతలు సిద్ధమయ్యారు. ఎవరో ఒకరు చేరితే చాలు ఆర్థికంగానే కాకుండా సామజికవర్గంగా కూడా కొంత బలం చేకూరుతుందని విశ్వసించారు. కానీ సొంత పార్టీ నేతలే వారి రాకను వ్యతిరేకించారు. ఒకరు కేసినో ఆడిస్తూ ఈడీ విచారణ ఎదుర్కొన్న చికోటి ప్రవీణ్ కాగా, మరొకరు నకిలీ స్టాంప్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కృష్ణ యాదవ్.
చేరిక వ్యవహారం...
వీరద్దరి చేరిక విషయంలో బీజేపీ నేతల వ్యవహారం పార్టీకి తలవొంపులు తెచ్చి పెట్టిందనే చెప్పాలి. కృష్ణయాదవ్ నకిలీ స్టాంప్ కుంభకోణం కేసులో అరెస్టయి చంద్రబాబు హయాంలో మంత్రిపదవిని కోల్పోయారు. అప్పటి నుంచి ఆయన రాజకీయంగా ఎదగలేకపోయారు. అధికార బీఆర్ఎస్ లో చేరినా ఆయనకు ఎలాంటి పదవిని ఆ పార్టీ అప్పగించలేదు. ఆయన అవసరం ఎంత వరకో అంత వరకే గులాబీ పార్టీ చూసుకుంది తప్ప పెద్ద పదవులు ఇచ్చి చెడ్డ పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయలేదు. కానీ బీజేపీ మాత్రం ఏమీ అర్థం కాని స్థితిలో ఆయనను చేర్చుకునేందుకు ముందుకు రావడం, అభ్యంతరాలు వెలువడటంతో వెనక్కు తగ్గడంతో ఉన్న పరువు కూడా పోగొట్టుకున్నట్లయింది.
తగ్గారా? చేర్చుకుంటారా?
చికోటి ప్రవీణ్ చేరిక కూడా ఇందుకు భిన్నంగా జరగలేదు. అసలు పార్టీకి వారిని చేర్చుకోవాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్న నేతల నుంచే ఎదురవుతున్నాయి. చికోటి ప్రవీణ్ ను చేర్చుకుంటే తాము రాజీనామా చేస్తామని బీజేపీ కార్పొరేటర్లు హెచ్చిరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలోనే పరువు పోతుందని గ్రహించి ఇద్దరినీ చేర్చుకోకుండా వెనక్కు తగ్గారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాళ్ల చేరికతో ఎంతమాత్రం లాభం లేకపోగా పార్టీ సిద్ధాంతాలకు, విధానాలకు తిలోదకాలిచ్చినట్లవుతుందని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి బీజేపీ నేతలు వీరిద్దరి చేరికపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.






Tags:    

Similar News