Ys Avinash Reddy : టిక్కెట్ ఇచ్చి జగన్ తప్పుచేశారా? గెలుపోటములు డిసైడ్ చేస్తాయా?
వైఎస్ అవినాష్ రెడ్డికి కడప పార్లమెంటు టిక్కెట్ ఇవ్వడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
గత ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైఎస్ వివేకా హత్య జరిగి ఐదేళ్లు కావచ్చింది. అయితే ఇప్పటి వరకూ హత్యకు గల కారణాలు ఏంటో తెలియలేదు. సీబీఐ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డికి తిరిగి టిక్కెట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ అవినాష్ రెడ్డి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారని భావించారు. కానీ ఈరోజు ప్రకటించిన జాబితాలో కడప పార్లమెంటు నుంచి అవినాష్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఎనిమిదో నిందితుడిగా...
వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి పేరు బలంగా వినిపించింది. దీంతో పాటు ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకుని ఉన్నారు. ఆయన బెయిల్ ఏ క్షణంలోనైనా రద్దయ్యే అవకాశాలున్నాయి. సీబీఐ విచారణకు కూడా పలుమార్లు హాజరయ్యారు. సీబీఐ కోర్టు నుంచి కూడా అవినాష్ రెడ్డి సమన్లు అందుకున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి మాత్రమే కాకుండా శివశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ లను ఛార్జిషీటులో సీబీఐ చేర్చింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటులో ఈ కేసులో అవినాష్ రెడ్డి ఎనిమిదో నిందితుడిగా ఉన్నారు. దీనిపై ఇప్పటికే ఆయన అభ్యంతరం కూడా తెలిపారు.
ఆరోపణలు ఉన్నా...
ప్రస్తుతం కడప పార్లమెంటు సభ్యుడిగా ఉన్న అవినాష్ రెడ్డి తన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ నిందితుడిగా చేర్చినా మరోసారి ఆయనకే టిక్కెట్ జగన్ ఇవ్వడం పార్టీలోనే కాదు రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలు కూడా అవినాష్ రెడ్డి ప్రమేయం పై తరచూ ఆరోపిస్తున్నారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా... వినిపించినా అవినాష్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.
అవినాష్ గెలిస్తే...
అయితే ఇదే సమయంలో వైఎస్ అవినాష్ రెడ్డి గెలిస్తే ప్రజామోదం పొందినట్లు అవుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అవినాష్ రెడ్డి ఈహత్య కేసులో నిందితుడంటే ప్రజలు నమ్మడం లేదన్నది ఈ ఎన్నికల ఫలితాల ద్వారా తేలనుంది. అందుకే జగన్ వైఎస్ అవినాష్ రెడ్డిని కడప పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కడప పార్లమెంటు నుంచి వైఎస్ సునీత పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఆమె కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా? లేదా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? అన్నది తేలాల్సి ఉంది.