BRS : ఓటమి తర్వాత పెదవి విప్పుతున్న నేతలు.. అధినాయకత్వంలో అంతర్మధనం
భారత రాష్ట్ర సమితి ఇటీవల ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి అనేక కారణాలున్నాయి. పేరు మార్పుపై అంతర్మధనం మొదలయింది
భారత రాష్ట్ర సమితి ఇటీవల ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి అనేక కారణాలున్నాయి. పదేళ్లు అధికారంలో ఉండటంతో పాటు ప్రభుత్వం చేసిన తప్పులు కూడా ఉండే ఉంటాయి. దీనికి తోడు పార్టీ అధినేత ఎవరికీ అందుబాటులో ఉండకపోవడం కూడా కిందిస్థాయి క్యాడర్ లో కొంత అసహనం ఏర్పడింది. వీటన్నింటితో పాటుగా సంక్షేమ పథకాలన్నింటినీ ఎమ్మెల్యేలు తమకు తోచినట్లుగా తమకు నచ్చిన వారికి పందేరం చేయడం కూడా మరొక కారణంగా ఆ పార్టీ నేతలే విశ్లేషిస్తున్నారు. స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను తాము గుర్తించినా వారిని మార్చలేకపోయామని చెప్పడం ఇందుకు నిదర్శనం.
బీఆర్ఎస్ గా మార్చడంపై...
అనేక కారణాలు కనిపిస్తున్నా ఇప్పుడు మరొక రీజన్ కూడా నేతలు వెలుగులోకి తెస్తున్నారు. అదే పేరు మార్పు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఎన్నికల వేళ భారత రాష్ట్ర సమితిగా మార్చడాన్ని కూడా కొందరు తప్పు పడుతున్నారు. అప్పట్లో అధికారంలో ఉండటంతో అధినేత ఎదుట నోరు మెదపలేని నేతలు ఈరోజు ఓటమి తర్వాత తమ మనసులో విషయాలను చెబుతున్నారు. గ్రౌండ్ రియాలిటీ ఇదీ అంటూ పార్టీ అగ్రనాయకత్వానికి చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నప్పుడు వరసగా రెండు సార్లు ఆశీర్వదించిన ప్రజలు, బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఓడించారంటూ ఆ పార్టీ నేతలే గుర్తు చేస్తుండటం విశేషం.
సెంటిమెంట్ దూరమై...
టీఆర్ఎస్ అంటే తెలంగాణలో అణువణువునా అందరికీ హార్ట్ టచ్ చేసేలా ఉందని, అదే బీఆర్ఎస్ పేరు మాత్రం పార్టీని దూరం చేసేలా ఉందన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతుంది. అసలు పేరు మార్చి అధినేత తప్పు చేశారని కూడా నేరుగా అధినేత వైఖరినే తప్పుపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి దేశాన్ని ఉద్ధరించడం కోసం బయలుదేరడం ఏమిటన్న కామెంట్స్ కూడా పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. అయితే అది నేరుగా కాదు. పార్టీ నేతలు కలుసుకున్నప్పుడు ప్రధానంగా పేరు అంశమే చర్చకు వస్తుంది. పేరు మార్చకుంటే మూడోసారి ముచ్చటగా గెలిచి ఉండేవారమన్న అభిప్రాయం పార్టీలో ఎక్కువ మంది వ్యక్తం చేస్తుండటం విశేషం.
సమావేశాల్లో...
ఇదే అభిప్రాయాన్ని సీనియర్ నేత, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలంటూ పార్టీ క్యాడర్ కోరుకుంటుందని ఆయన చెప్పడం విశేషం. కేటీఆర్ సమక్షంలోనే కడియం శ్రీహరి పేరు మార్చడం కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందని అన్నట్లు సమాచారం. తెలంగాణ పేరును తొలగించి భారత్ ను చేర్చడం వల్ల ఉన్న సెంటిమెంట్‌ను కోల్పోయామని కూడా ఆయన అన్నారు. ఈ భావన ప్రజలలో ఉందని, తిరిగి బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చడమే మంచిదన్న సూచన వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో కేటీఆర్ కు సూచించినట్లు తెలిసింది.