Vijaya Sai Reddy : విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారా? జరుగుతున్న ప్రచారంలో నిజమెంత?
వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.;

వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఈ మేరకు బీజేపీ పెద్దలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలిసింది. విజయసాయిరెడ్డి వైసీపీతో పాటు రాజ్యసభ పదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఆ పదవి ఖాళీగా ఉంది. అయితే సాయిరెడ్డి మాత్రం తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే ఆయన మనసు మారిందని తెలిసింది. బీజేపీలో చేరడమే కాకుండా తిరిగి రాజ్యసభ పదవి పొందేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఇప్పటికే పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బీజేపీ పెద్దలతో సమావేశమై తన మనసులో మాటను కూడా చెప్పినట్లు తెలిసింది.
వైసీపీపై దూకుడుగా...
తొలుత వైసీపీకి రాజీనామా చేసినా జగన్ విషయంలో సాయిరెడ్డి కొంత సాఫ్ట్ కార్నర్ గానే కనిపించారు. జగన్ పై విమర్శలు చేయలేదు. అయితే వైఎస్ షర్మిలను నేరుగా వెళ్లి ఆమె నివాసంలో కలవడం, తర్వాత జగన్ సాయిరెడ్డిపై ఆరోపణలు చేయడంతో ఆయన ఇక వైసీపీపైకి ఒంటి కాలి మీద లేస్తున్నారు. మద్యం కుంభకోణంలో సూత్రధారుల పేర్లను బయటపెట్టారు. కసిరెడ్డి సూత్రధారి అని విజయసాయిరెడ్డి నేరుగా ఆరోపణలు చేసిన తర్వాత పోలీసులు ఆ దిశగా దర్యాప్తు కూడా ప్రారంభించారు. సాయిరెడ్డి ఆరోపణలను బహిరంగంగా చెప్పిన తర్వాత మాత్రమే టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా దీనిపై హోంమంత్రికి ఫిర్యాదు చేయడమే కాకుండా అందుకు తగిన ఆధారాలు కూడా సమర్పించారు.
గవర్నర్ పదవి అంటూ...
విజయసాయిరెడ్డి తొలుత గవర్నర్ పదవిని ఆశించినట్లు ప్రచారం జరిగింది. రాజకీయాలకు దూరంగా ఉంటూ గవర్నర్ పదవి అయితే కొంత వరకూ తన పరపతిని పెంచుకోవచ్చని భావించారు. కానీ గవర్నర్ పదవి కంటే ఇప్పుడు తిరిగి రాజ్యసభ పదవిపైనే ఆయన మక్కువ చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెద్దల సభలో తిరిగి అడుగుపెట్టి బీజేపీలో కీలకంగా మారాలని భావిస్తున్నారు. అందుకే ఆయన ఢిల్లీలో పార్టీ పెద్దలతో లాబీయింగ్ చేస్తున్నారని తెలిసింది. తాను రాజీనామా చేసిన స్థానంలో తిరిగి తననే నియమించాలని, తాను పార్టీకి కట్టుబడి, పార్టీ కోసం కష్టపడి పనిచస్తానని కమలనాధులకు హామీ ఇచ్చిన విజయసాయిరెడ్డి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
టీడీపీలో విముఖత...
మరొకవైపు ఇందుకు పవన్ కల్యాణ్ కొంత మేరకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ, టీడీపీ నుంచి సాయిరెడ్డికి తిరిగి రాజ్యసభ పదవి ఇవ్వడం పట్ల అంతగా ఆసక్తి లేదని అంటున్నారు. వైసీపీలో ఉన్నప్పుడు, ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాయిరెడ్డి చంద్రబాబు పైనా, పవన్ కల్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలను వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తనపై నమోదయిన కేసుల నుంచి బయటపడేందుకే విజయసాయిరెడ్డి కమలం తీర్థం పుచ్చుకోవాలని భావిస్తున్నారన్న ప్రచారం గట్టిగానే జరుగుతుంది. అయితే ఇప్పటి వరకూ బీజేపీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదని తెలిసింది. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారన్ని బట్టి తెలుస్తోంది.