YSRCP : స్ట్రాంగ్ లీడర్.. హర్ట్ అయ్యారు.. పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారట
వైసీపీ సీనియర్ నేత పార్థసారధి పార్టీ మారేందుకు సిద్ధమయినట్లు తెలిసింది. ఆయన టీడీపీలో చేరతారని సమాచారం
వైసీపీ సీనియర్ నేత పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయి. ఆయనకు టీడీపీలో బెర్త్ కూడా ఖరరాయింది. వైసీపీలో తనకు ప్రయారిటీ లేకపోవడంతో పక్క చూపులు చూస్తున్న ఆయనను సైకిల్ పార్టీ లాగేసుకున్నట్లే కనిపించింది. ఆయనే పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి. ఆయన త్వరలోనే వైసీపీని వీడటం ఖాయంగా కనిపిస్తుంది. పెనమలూరు నియోజకవర్గం నుంచి కాకుండా మరొక స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ తరుపున బరిలోకి దిగుతారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు పార్థసారధి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చించినట్లు తెలిసింది. తన ముఖ్య అనుచరులతో కూడా ఆయన సమావేశమై వైసీపీిని వీడేందుకే నిర్ణయించుకున్నట్లు సమాచారం.
మూడు సార్లు గెలిచినా...
పార్థసారధి వైసీపీకి స్ట్రాంగ్ లీడర్. కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు. 2004లో తొలిసారి పార్థసారధి అప్పటి ఉయ్యూరు శాసనసభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2009లో ఉయ్యూరు పెనమలూరు నియోజకవర్గంగా మారిపోవడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లో ఆయన మంత్రి అయ్యారు కూడా. అయితే 2014లో మాత్రం ఆయన వైసీపీలో చేరి మచిలీపట్నం పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత 2019 ఎన్నికల్లో తిరిగి పెనమలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున బరిలోకి దిగి గెలిచారు.
వెన్నంటే ఉన్నా...
జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచే ఆయన వెన్నంటి ఉన్నారు. అయితే తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, పార్టీ కోసం పనిచేసినా తనకు జగన్ మంత్రి పదవి ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్నారు. పార్థసారధి ట్రాక్ రికార్డు చూసినా జగన్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. పార్థసారధి తండ్రి రెడ్డయ్య యాదవ్ 1991, 1996లో మచిలీపట్నం పార్లమెంటు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయినా బీసీ సామాజికవర్గానికి చెందిన పార్థసారధి తనకు మంత్రి పదవి ఖాయమని భావించారు. అందులోనూ తొలి విడతలో నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు మంత్రి పదవి ఇవ్వడంతో రెండో దఫా అయినా జగన్ తనకు కేబినెట్ లో చోటు కల్పిస్తారని భావించారు. కానీ యాదవ సామాజికవర్గం కోటాలో జగన్ కారుమూరి నాగేశ్వరరావుకు ఇచ్చారు. పార్థసారధిని పక్కన పెట్టారు. అందుకే ఆయన హర్ట్ అయ్యారని తెలిసింది.
మంత్రి పదవి హామీ...
అప్పటి నుంచే ఆయన అసంతృప్తితో పార్థసారధి ఉన్నారు. ఎన్నికలు సమీపించే సమయంలో ఆయనలోని అసంతృప్తిని గుర్తించిన టీడీపీ నేతలు ఆయనకు టచ్ లోకి వచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా ఇస్తామన్న హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఆయనను పెనమలూరు నుంచి కాకుండా నూజివీడు నుంచి పోటీ చేయాలని కోరినట్లు చెబుతున్నారు. పార్థసారధి అందుకు అంగీకరించినట్లు తెలిసింది. తనను పూర్తిగా పక్కన పెట్టిన జగన్ వెంట ఉంటే కంటే తనను కావాలని పిలుచుకున్న టీడీపీలో చేరడమే బెటర్ అని పార్థసారధి భావిస్తున్నారు. టీడీపీకి కూడా బలమైన బీసీనేతలు పార్టీలో చేరడం ఇప్పుడు అవసరం. అందుకే ఏరికోరి పార్థసారధికి ఫుల్లు హామీలు ఇచ్చారని తెలుస్తోంది. మొత్తం మీద సీనియర్ నేత పార్టీని వీడటం వైసీపీకి జిల్లాలో పెద్ద దెబ్బేనని చెప్పాలి.