ఆట ముగించేదెవరో?
చెస్ లో ప్రజ్ఞానంద నుంచి విశ్వనాథన్ ఆనంద్ వరకూ ఇలాగే చూశాం. విన్నాం. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ గేమ్ మొదలయింది.
చదరంగంలో గ్రాండ్ మాస్టర్ లు ఎలా ఛేంజ్ అవుతుంటారో రాజకీయ రంగంలోనూ అంతే. ఎత్తుకు పై ఎత్తులు వేయడం చదరంగంలో విజేత అవుతారు. గ్రాండ్ మాస్టర్ పేరును సొంతం చేసుకంటారు. ఇందులో వయసుతో సంబంధం లేదు. మైండ్ గేమ్ కావడంతో ఎత్తులు.. పైఎత్తులే ఇందులో జయాపజయాలను నిర్ణయిస్తాయి. రాజకీయంలోనూ అంతే. ఎత్తులు ఎవరు వేస్తారో.. వాటిని పసిగట్టగలిగితే ఓకే. లేకుంటే ఎత్తుకు పై ఎత్తు వేయలేక చేతులెత్తేసే పరిస్థితి వస్తుంది. చెస్ లో ప్రజ్ఞానంద నుంచి విశ్వనాథన్ ఆనంద్ వరకూ ఇలాగే చూశాం. విన్నాం. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ గేమ్ మొదలయింది. ఆట ఎవరు ప్రారంభించారు.. అనేదానికంటే ఎవరు ముగిస్తారన్నదే ఇందులో కూడా ముఖ్యం.
ఊహించిన విధంగా...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహుశ తాను జైలులో పది రోజుల పాటు ఉంటానని ఊహించి ఉండరు. తనను ఒకవేళ అరెస్ట్ చేసినా న్యాయస్థానంలో బెయిల్ ద్వారా బయటకు రావచ్చన్న ధీమా ఆయనలో పుష్కలంగా మొన్నటి వరకూ ఉంది. అందుకే అరెస్ట్ కు మూడు రోజుల ముందు వరకూ ఆయన సవాల్ మీద సవాల్ విసిరారు. నాలుగు సంవత్సరాలు గడిచి పోవడంతో తనను అరెస్ట్ చేసే ధైర్యం జగన్ చేయరని చంద్రబాబు అంచనా వేసి ఉండవచ్చు. అందుకే ఆయన తరచూ ఛాలెంజ్ చేస్తూ వచ్చారు. తాను నిప్పునంటూ చెప్పుకుని తిరుగుతున్న చంద్రబాబుకు పెద్ద షాక్ ఇచ్చారు జగన్. ఇది టీడీపీ అధినేత సయితం ఊహించి ఉండరు.
అంచనా వేయలేక…
కానీ జగన్ ను అంచనా వేయడంలో చంద్రబాబు తప్పులో కాలేశారు. జగన్ లో రాజీ ధోరణి తక్కువ. తాను అనుకున్నదే చేస్తారు. 2014 ఎన్నికలలో రైతు రుణమాఫీ చేయాలని అందరూ సూచించినా తాను ఒప్పుకోలేదు. అలాగే శాసనమండలి విషయంలోనూ జగన్ తన ఆలోచనకే పరిమితమయ్యారు. మండలిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి కేంద్రానికి పంపారు. భవిష్యత్ గురించి అస్సలు ఆలోచించలేదు. తనకున్న 151 మంది సభ్యులతో ఖాళీ కానున్న శాసనమండలి స్థానాలన్నీ తనవేనని తెలిసినా రద్దుకే మొగ్గు చూపిన మనస్తత్వం జగన్ ది. అలాంటి జగన్ సమయం కోసం వేచి చూస్తున్నారని అందరికీ తెలుసు.
లెక్కలు వేసి…
ఎన్నికలు వస్తాయని, చంద్రబాబును అరెస్ట్ చేస్తే సింపతీ వస్తుందని లెక్కలు కూడా జగన్ మనసులో అస్సలు చోటుండవు. గణాంకాలు ఎప్పుడూ జగన్ దరి చేరవు. ఆయనకున్న లక్స్యం తాను అనుకున్న విషయాన్ని గ్రౌండ్ చేయడమే. వైసీపీ అధినేత మనస్తత్వం తెలిసిన వారెవరికైనా ఇది తెలుసు. తనను జైలు నెంబరుతో అవమానిస్తున్న చంద్రబాబును జైలుకు పంపడమే జగన్ లక్ష్యం. అందులో ఎలాంటి శషభిషలకు తావులేదు. నాలుగు పదుల రాజకీయ అనుభవమున్న చంద్రబాబును జగన్ ఈరకంగా దెబ్బతీస్తారని ఎవరూ అనుకోలేదు. టీడీపీ క్యాడర్ మనోస్థైర్యాన్ని చంద్రబాబు అరెస్ట్ ఎంత మేరకు దెబ్బతీసిందో చెప్పలేం కాని, రాజకీయ చదరంగంలో అయితే మాత్రం జగన్ గ్రాండ్ మాస్టర్ అయ్యాడనే చెప్పాలి.
పైచేయి…
2014 అధికారంలోకి వచ్చిన తర్వాతనే చంద్రబాబు నిర్ణయాలు రాజకీయంగా కలసి రావడం లేదు. బీజేపీతో విభేధించడంతో పాటు ప్రత్యేకే ప్యాకేజీకి అంగీకరించడం, 2019 ఎన్నికల్లో తిరిగి మోదీ భజన చేయడం వంటివి ఆయన రాజకీయ ప్రతిష్టను దిగజార్చాయి. విజన్ ఉన్న నేతకు తాను వేసే అడుగులు ఏ మేరకు నష్టం చేకూరుస్తాయన్న చంద్రబాబు అంచనా వేయలేకపోయారు. ఇప్పటికైతే మాత్రం జగన్ దే పైచేయి అనుకోవాలి. చంద్రబాబును పది రోజులకు పైగానే జైల్లోనే ఉంచడం ఆయన సాధించిన గెలుపు కావచ్చు. అలాగని రానున్న ఎన్నికల్లో ఈ అరెస్ట్ ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది ఇప్పటికయితే ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి. ఎందుకంటే తొమ్మిది నెలల్లో ఎన్నో మార్పులు.. ఎన్నో కారణాలు రానున్న ఎన్నికలను ప్రభావితం చేస్తాయి కాబట్టి.