ఇన్నర్‌ రింగ్ రోడ్డు స్కామ్ ఏంటి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఇప్పుడు ఇన్నర్ రింగ్‌రోడ్డు స్కామ్ ఒక కుదుపు కుదుపేస్తుంది.

Update: 2023-09-28 06:04 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఇప్పుడు ఇన్నర్ రింగ్‌రోడ్డు స్కామ్ ఒక కుదుపు కుదుపేస్తుంది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు మరో కుంభకోణం మెడకు చుట్టుకునేలా ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పెద్దయెత్తున స్కామ్ జరిగిందని సీఐడీ ఆరోపిస్తుంది. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ఏ 1గానూ, మాజీ మంత్రి నారాయణ ఏ2గానూ, లింగమనేని రమేష్ ఏ 4, లింగమనేని రాజశేఖర్ ఏ5గానూ, నారా లోకేష్ ఏ 14గా ఉన్నారు. ఈకేసులోనూ త్వరలోనే అరెస్ట్‌లుండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు సీఐడీ అధికారులు కసరత్తులు చేస్తున్నారు.

వేల కోట్లకు...
ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో పెద్దయెత్తున కుంభకోణం జరిగిందని సీఐడీ ఆరోపిస్తుంది. ఇందులో క్విడ్ ప్రోకో కూడా జరిగిందన్న ఆరోపణలున్నాయి.ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చడమే పెద్ద కుంభకోణానికి దారి తీసిందన్నారు. మార్కెట్ ధర పెరిగేలా చేసేందుకే అలైన్‌మెంట్ మార్చారన్న ఆరోపణలున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చడంతో ఒక్క లింగమనేని రమేష్ భూముల విలువ 177 కోట్ల రూపాయల నుంచి 877 కోట్ల రూపాయలకు పెరిగిందన్నది సీఐడీ ఆరోపణ. రాజధాని నిర్మాణం పూర్తయితే 2,130 కోట్ల వరకూ భూముల విలువ చేరేలా ప్లాన్ చేసినట్లు సీఐడీ బలమైన ఆధారాలను సేకరించింది.
భూములకు దగ్గరగా...
తొలుత సీఆర్డీఏ అధికారులు రూపొందించిన 94 కిలోమీటర్ల ఇన్నర్ రిండ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను రాజకీయ అవసరాల కోసం మార్చారు. తాము ఆర్థికంగా లబ్ది పొందేందుకు ఈ అలైన్‌మెంట్ ను మార్చినట్లు సీఐడీ అధికారులు చెబుతున్నారు. సీఆర్డీఏ రూపొందించిన అలైన్‌మెంట్ ప్రకారం పెద్దపరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద్ద వడ్లపూడి మీదుగా వెళ్లాి. అయితే అక్కడ హెరిటేజ్ కంపెనీ, మాజీ మంత్రి నారాయణ, చంద్రబాబుకు చెందిన భూములతో పాటు లింగమనేని భూములకు మూడు కిలోమీటర్ల దూరం నుంచే ఈ రోడ్డు వెళుతుంది. అందుకే దీనిని మార్చినట్లు చెబుతున్నారు. ఈ మార్పులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారాయణలు జోక్యం చేసుకుని మార్చినట్లు సీఐడీ చెబుతుంది. నారాయణ విద్యాసంస్థలకు చెందిన భూములు కూడా ఇక్కడే ఉన్నాయి.
విలువ పెరగడంతో...
ఈ కుటుంబాలకు చెందిన వందల ఎకరాల భూములున్న తాడికొండ, కంతేరు, కాజలను అలైన్‌మెంట్ మార్పునకు నిర్ణయం తీసుకున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డును మూడు కిలోమీటర్లు దక్షిణం వైపునకు మార్చారు. దీనివల్ల రాజకీయ నేతలు, హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కి చెందని భూములు కంతేరు, కాజాలలో ఉన్నాయి. ఈ భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా 97.50 కిలో మీటర్ల మేర అలైన్‌మెంట్ ను మార్చారని చెబుతున్నారు. ఇందుకోసం సింగపూర్ కు చెందిన కన్సల్టెన్సీకి అప్పగించారు. దీంతో ఒక్కసారిగా భూముల ధరలు పెరిగేలా ఈ అలైన్ ‌మెంట్‌లో మార్పు చేశారన్నది సీఐడీ ఆరోపణ. ఇక్కడ లింగమనేని కుటుంబానికి 355 ఎకరాలు, హెరిటేజ్ కు 13 ఎకరాలు ఉన్నాయి. అంతేకాదు మార్చిన అలైన్ మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో భూములు పెద్దయెత్తున కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ కేసును సీఐడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చంద్రబాబును విచారించేందుకు న్యాయస్థానంలో పీటీ వారెంట్ దాఖలు చేసింది.
Tags:    

Similar News