నడ్డా, షా.. బోల్తా పడ్డారా!

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కుతున్న తరుణంలో అధ్యక్షుల్ని మారుస్తూ భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయం..

Update: 2023-07-05 12:58 GMT

Amit shah, Nadda

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కుతున్న తరుణంలో అధ్యక్షుల్ని మారుస్తూ భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయం సంచలనం రేకెత్తించింది. తెలంగాణలో బీజేపీకి కొత్త నెత్తురు ఇచ్చిన బండి సంజయ్‌ని తప్పించడం, ఆంధ్ర ప్రదేశ్ లో పురంధేశ్వరిని అధ్యక్షురాలిగా చేయడంలో నడ్డా, షా ధ్వయం బోల్తా పడ్డట్లే అనిపిస్తోంది. 

కమలం పార్టీ ధోరణి చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో అనవసర ప్రయోగాలకు తెర తీస్తున్నట్లు అర్థమవుతోంది. తెలంగాణలో బీజేపీ ప్రస్థానాన్ని బండి సంజయ్‌కు ముందు బండి సంజయ్‌ తర్వాత అని చెప్పుకోవాలి. ఆయన అధ్యక్షుడైన తర్వాతే బీజేపీకి రాష్ట్రంలో జవసత్వాలు పుట్టుకొచ్చాయి. ఇటు అధికార పార్టీతో పోరాడటంతో పాటు అటు ఒవైసీతో కూడా సై అంటే సై అన్నారు. చార్మినార్‌ దగ్గర ఉన్న మహాలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి సంచలనం సృష్టించారు. ఇటీవల బీజేపీ నాయకుడు రఘనందనరావు బండి సంజయ్‌పై చేసిన ఆరోపణల వల్ల ఆయనను తప్పించారనే వాదన వినిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ పుంజుకుంటున్న వేళ బండి సంజయ్‌ను తప్పించడంపై భాజపా వర్గాల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. సంజయ్‌కి కూడా తన పదవి మార్పు రుచించలేదు. సంజయ్‌తో పోలిస్తే కిషన్‌రెడ్డి మృదు స్వభావి. ఆయన ఇటు తెరాస, అటు కాంగ్రెస్‌తో ఎలా డీల్‌ చేస్తారో చూడాలి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఇదే సువర్ణావకాశం. గెలిస్తే కిషన్‌రెడ్డికి పేరు వస్తుంది. ఓటమి మాత్రం భాజపా అధిష్టానం ఖాతాలోకి వెళ్లిపోతుంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో పురంధేశ్వరి తెరపైకి రావడం అనూహ్యమే. చివరి వరకూ సత్యకుమార్‌ పేరు చక్కర్లు కొట్టింది. ఎలానూ ఆంధ్రలో గెలిచే అవకాశాలు లేవని బీజేపీకి తెలుసు. అందుకే వివాదరహితురాలిగా పేరున్న పురంధేశ్వరికి పగ్గాలు అప్పగించారు. జనసేనతో కలిసి కాపు ఓట్లకు గాలం వేద్దామనుకుని తొలుత బీజేపీ భావించింది. పవన్‌ కళ్యాణ్‌ నిలకడ లేనితనం వల్ల ఎన్టీఆర్ కుమార్తెకి అధ్యక్ష పదవి దక్కిందని వాదన కూడా వినిపిస్తోంది. ఆంధ్రలో ఎవరు గెలిచినా తమకే మద్దతు ఇస్తారనే ధైర్యం ఉండటం వల్లే ఇక్కడి రాజకీయాల విషయంలో బీజేపీ అంత సీరియన్‌గా లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

భాజపా అధ్యక్షుడిగా గత మూడేళ్లుగా పని చేస్తున్న సోము వీర్రాజును తప్పించడానికి అతని వ్యవహార శైలే కారణమనే ఆరోపణలున్నాయి. ఆయన వల్లే కన్నా లక్ష్యీనారాయణ పార్టీని వదలి వెళ్లిపోయారని అధిష్టానం భావిస్తోంది. తెలుగుదేశం, వైకాపాలకు సమాన దూరం పాటించే ఆయన వైఖరి కూడా భాజపాలో కొంతమందికి నచ్చలేదు. మరో పది నెలల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భాజపా చేసిన ఈ ప్రయోగాల పట్ల సొంత పార్టీలో అసంతృప్తి రాజుకుంది. ఆంధ్రలో బలం లేకపోయినా, తెలంగాణలో బలంగా ఉన్న పార్టీపై అధ్యక్ష మార్పు ప్రతికూల ప్రభావం చూపించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News