'సీమ'లో బాబు సమరోత్సాహం.. పులివెందులలో 'అమరావతి' నినాదాలు!!
ఎవరి పాలనలో ఏ రంగాలు ఎట్లా ఉన్నాయో ప్రజలు బేరీజు వేసుకునే అవకాశం లభిస్తుంది.ముఖ్యమంత్రి జగన్,పవన్,చంద్రబాబులలో
''మీ ఉత్సాహం చూస్తుంటే ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని అనిపిస్తోంది'' అని చంద్రబాబు పులివెందుల గడ్డ మీద తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ అన్నారు.''వై నాట్ పులివెందుల'' అని కూడా ఆయన గర్జించారు.ఆయన ప్రసంగంతో పులివెందుల దద్దరిల్లింది.ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబును చెడుగుడు ఆడారు.మంత్రిని 'ఆంబోతు రాంబాబు' అని హేళన చేశారు.'బ్రో' సినిమాను కూడా ప్రస్తావించి సెటైర్లు వేశారు.'అమరావతే రాజధాని' అనే నినాదాలను ప్రజలతో చెప్పించారు.విశాఖపట్నం రాజధాని ప్రతిపాదనను బాబు గట్టిగా వ్యతిరేకించారు.
చంద్రబాబు నాయుడు కదనకుతూహలంతో ఉన్నారు.ముఖ్యమంత్రి జగన్ అడ్డాలో తొడలు కొట్టారు.ఇదంతా పవన్ కళ్యాణ్ అందించిన స్ఫూర్తి.జనసేనాని ఉభయగోదావరి జిల్లాల్లో వారాహి యాత్రతో జగన్ మోహనరెడ్డిపై చెలరేగిన తీరు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా పేరు మోసిన చంద్రబాబుకు నచ్చింది.గోదావరి జిల్లాలను పవన్ చుట్టుముడుతుండగా,ఇటు రాయలసీమలో 'యుద్దబేరి'ని మోగించారు. 'ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' గా తన యాత్రకు చంద్రబాబు నామకరణం చేశారు.పెన్నా నుంచి వంశధార వరకు టీడీపీ అధ్యక్షుని యాత్ర సాగుతోంది.ఇక చంద్రబాబు కొడుకు లోకేష్ 'యువగళం' పాదయాత్ర ప్రకాశం జిల్లా గుండా వెడుతోంది.వైసీపీ అధ్యక్షుడు,సీఎంను నలువైపుల నుంచి దిగ్బంధం చేయాలన్నది టీడీపీ,జనసేన ఉమ్మడి యహం అయి ఉండవచ్చు.అందువల్లనే మూడో విడత వారాహి యాత్రను ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టాలని పవన్ ముందు ప్రతిపాదనలు వస్తున్నవి.ఆయన పర్యటన ఇంకా ఖరారు కాలేదు.రోడ్ మ్యాపు రూపకల్పన చివరిదశలో ఉన్నట్టు కొందరు 'వీర మహిళ'లు 'తెలుగుపోస్టు' కు చెప్పారు.
యువనేత లోకేశ్ పాదయాత్ర సందర్భంగా కడప,కర్నూలు,అనంతపురం జిల్లాల్లో వచ్చిన స్పందన కన్నా చంద్రబాబు నాయుడుకు ఇంకా స్పందన కనిపిస్తోంది.ప్రజాదరణ ఎక్కువగా కనబడుతోంది.బుధవారం రాత్రి ఉమ్మడి కడప జిల్లా పులివెందులలో పూల అంగళ్ల కూడలిలో జనం పోటెత్తడం ఆశ్చర్యమే! రెండో రోజే,అది కూడా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో,జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో లభించిన అపూర్వ స్వాగతం సహజంగానే వైసీపీ నాయకులలో ఆందోళన కలిగిస్తుంది.2019 లో కడప,కర్నూలు,నెల్లూరు,విజయనగరం జిల్లాలలో టీడీపీని వైసీపీ తుడిచిపెట్టింది.ఆ జిల్లాల్లో టీడీపీ ఖాతా తెరవకపోవడం చంద్రబాబును కలచివేసింది.మనోవేదనకు గురిచేసింది.చాలాకాలం టీడీపీ అధినేత కోలుకోలేదు.రెండు చోట్ల అసెంబ్లీకి పోటీచేసి ఓటమి పాలయినప్పటికీ హీరో పవన్ కళ్యాణ్ తొందరగానే తేరుకున్నారు.తన ఓటమిని లెక్కచేయకుండా,కుంగిపోకుండా జగన్ పైనా,వైసీపీపైనా సమరశంఖం పూరించడం,రాజకీయనాయకులంతా నేర్చుకోవలసిన పాఠం.
పవన్ తెగింపు వైఖరిని చంద్రబాబు మోడల్ గా తీసుకున్నట్టు భావించవచ్చు.నంద్యాల జిల్లా నందికొట్కూరు నుంచి శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం వరకు 10 రోజులు 2500 కిలోమీటర్లు యుద్ధభేరి ఉంటుంది.కాగా జమ్మలమడుగులో రోడ్ షోలో భూపేష్ రెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.భూపేష్ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుని కుమారుడు.ఆదినారాయణరెడ్డి గతంలో టీడీపీకి గుడ్ బై చెప్పారు.2019 ఎన్నికల్లో కడప జిల్లా ఎంపీగా పోటీచేసి పరాజయం పాలయ్యారు. టీడీపీ అధికారంలోకి రాకపోవడం,మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆదినారాయణ రెడ్డిపైనా వైసీపీ నాయకులు ఆరోపణలు చేయడంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.ఆయన సోదరుడు మాత్రం తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్నారు.ఆదినారాయణ రెడ్డి కూడా తన రాజకీయ వారసుడిగా తన అన్న కుమారుడు భూపేష్ రెడ్డినే ప్రకటించారు.
ఏపీలో రాజకీయాలు ప్రాజెక్టుల చుట్టూ నడుస్తున్నవి.ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేసిందని టీడీపీ ఆరోపణ.టీడీపీ నిర్లక్ష్యం చేసిన పథకాలను వైసీపీ ఫోకస్ చేస్తోంది.పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన చంద్రబాబు ప్రభుత్వంపై దాడిలో ముందంజలో ఉన్నారు.అధికార,ప్రతిపక్షాల మధ్య రాయలసీమ వేదికగా సవాళ్లు నడుస్తున్నవి. చంద్రబాబునాయుడు దూకుడు పెంచారు. కడప జిల్లా గండికోట రిజర్వాయర్‌ను సందర్శించి సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించిన్నప్పుడు ప్రజలు నీరాజనాలు పలకడం వైసీపీ నాయకత్వాన్ని దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలలో ప్రాజెక్టులకు మొత్తం 12వేల 441 కోట్లు ఖర్చు చేశామన్నది చంద్రబాబు వాదన.రాయలసీమ ప్రాజెక్టులకు 2వేల 11 కోట్లు మాత్రమే వైసీపీ ఖర్చు పెట్టిందని ఆరోపణ. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల విధ్వంసం జరిగిందన్న ప్రచారాన్ని చంద్రబాబునాయుడు ఉధృతం చేశారు.
''నేను రాయలసీమ బిడ్డను.ఇక్కడే పుట్టాను.సీమను రతనాల సీమగా మార్చుతా.నాకు వయోభారం లేదు.వయసు అనేది నా దృష్టిలో ఒక నెంబర్ మాత్రమే.ముఖ్యమంత్రి జగన్ ఒక సైకో.నేను నడచిన దారిలో వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రయాణించారు.కేసీఆర్ కూడా నా అభివృద్ధి నమూనాను అనుసరిస్తున్నారు.'' అని ఆయన పులివెందులలో ప్రజలకు హామీ ఇచ్చారు.
''రాయలసీమ ద్రోహి చంద్రబాబుకు మమకారమే లేదు. 2014 నుంచి 19 మధ్యలో కుప్పంలో పాలారు ప్రాజెక్టును కూడా పూర్తి చేసుకోలేకపోయారు.రాయలసీమ ప్రాజెక్టులపై పర్యటన కాకుండా చర్చకు రావాలి. ప్రాజెక్టుల సందర్శన కంటే చర్చకు వస్తే అసలు నిజాలు బయటపడతాయి. కుప్పంలోనైనా చర్చకు సిద్ధం. హంద్రీనీవా ప్రాజెక్టును నిర్వీర్యం చేసి ఐదు టీఎంసీలకు పరిమితం చేసిన ఘనత చంద్రబాబుది'' అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటున్నారు.అయితే రాయలసీమలో చంద్రబాబు పర్యటనలు రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీస్తున్నవి.రాజకీయ పార్టీల నాయకుల పర్యటనలు,హెచ్చరికలు,సవాళ్ల సంగతి ఎలా ఉన్నా దాదాపు ఆరు దశాబ్దాలుగా రాయలసీమలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదన్న అంశం మాత్రం తెరపైకి వచ్చింది.
ఇది శుభపరిణామమే.ఎవరి పాలనలో ఏ రంగాలు ఎట్లా ఉన్నాయో ప్రజలు బేరీజు వేసుకునే అవకాశం లభిస్తుంది.ముఖ్యమంత్రి జగన్,పవన్,చంద్రబాబులలో ఎవరు ఏమి చెబుతున్నారో జనమే విశ్లేషించుకుని నిర్ధారణకు వస్తారు.