అక్కడ కూడా రాజకీయాలేనా.. చంద్రబాబు వర్సెస్ వాసిరెడ్డి పద్మ

అత్యాచార బాధితురాలు, ఆమె త‌ల్లి స‌మ‌క్షంలోనే వీరిద్ద‌రూ ఒక‌రిపై మ‌రొక‌రు కేక‌లు వేసుకున్నారు. బాధితురాలిని ప‌రామ‌ర్శ..

Update: 2022-04-22 11:48 GMT

విజ‌య‌వాడ : నగరంలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఏపీ విప‌క్ష నేత నారా చంద్ర‌బాబునాయుడు, ఏపీ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌ల మ‌ధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. అత్య‌చార బాధితురాలు, ఆమె త‌ల్లి స‌మ‌క్షంలోనే వీరిద్ద‌రూ ఒక‌రిపై మ‌రొక‌రు కేక‌లు వేసుకున్నారు. బాధితురాలిని ప‌రామ‌ర్శించేందుకు వాసిరెడ్డి ప‌ద్మ రాగా అప్ప‌టికే అక్క‌డికి చంద్ర‌బాబు వ‌స్తున్నార‌న్న స‌మాచారంతో ఆసుప‌త్రికి చేరుకున్న టీడీపీ శ్రేణులు ఆమెకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. వాసిరెడ్డి ప‌ద్మ లోపలికి వెళ్ళడానికి చాలానే కస్టాలు పడ్డారు. ఆమె వెళిపోక ముందే అక్క‌డికి చంద్ర‌బాబు వచ్చారు. రాష్ట్రంలో ఇంత దారుణాలు జ‌రుగుతుంటే ఏం చేస్తున్నార‌ని వాసిరెడ్డిని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. తాము కూడా బాధితుల‌కు అండ‌గా నిలుస్తున్నామ‌ని, నేరాల కట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పద్మ బ‌దులిచ్చారు. అలా వాగ్వాదం జ‌రుగుతుండ‌గా టీడీపీ నాయకురాలు పంచుమ‌ర్తి అనురాధ వచ్చి.. వాసిరెడ్డి ప‌ద్మ‌పై విమర్శలు చేశారు. ప‌రిస్థితి చేయి దాటిపోతోంద‌ని భావించిన చంద్ర‌బాబు అనురాధను సంయ‌మనం పాటించాలంటూ సూచించారు.

అప్పటి ఘోరాలను మరిచారా ?
మ‌హిళా క‌మిష‌న్ చైర్ పర్సన్ హోదాలో వెళ్లిన వాసిరెడ్డి ప‌ద్మ‌పై చంద్ర‌బాబు త‌దిత‌రులు దాడికి పాల్ప‌డ్డారంటూ వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. మంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని మాట్లాడుతూ.. టీడీపీ హ‌యాంలో జ‌రిగిన ఘోరాల‌ను మ‌రిచారా? అంటూ ప్రశ్నించారు. అత్యాచార ఘ‌ట‌న‌పై త‌మ ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స్పందించింద‌ని చెప్పారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉంటామని, బాధిత కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని అన్నారు. ఈ ఘ‌ట‌న‌ను చంద్ర‌బాబు రాజ‌కీయం చేస్తున్నార‌ని మంత్రి ఆరోపించారు.
శవ రాజకీయాల కోసమే..
మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ ఈ ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ వెంటనే స్పందించి అన్ని శాఖలను చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయడం వేగంగా జరిగిపోయాయని అన్నారు. శవ రాజకీయాలు చేయడానికి చంద్రబాబు అక్కడికి వచ్చారని, కాల్ మనీ సెక్స్ రాకెట్‌ నేతలు మహిళా కమిషన్ చైర్మన్‌పై దాడికి దిగారని విరుచుకుపడ్డారు. వేలకోట్ల రూపాయలు అక్కచెల్లెమ్మల అకౌంట్లలో వేసే సమయంలోనే కావాలని చంద్రబాబు హడావుడి చేశారని మండిపడ్డారు. ఇది బాధ్యత గల ప్రభుత్వమని, వాసిరెడ్డి పద్మపై దాడి చేయాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాసిరెడ్డి పద్మపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు.
బాధితురాలి కుటుంబానికి ఇల్లు
హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించిన నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ప్రభుత్వం ఉపేక్షించదని తెలిపారు. నిందితులను ఉరి తీయడం న్యాయస్థానం పరిధిలో ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని పేర్కొన్నారు. బాధితురాలికి ఇల్లు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే అర్హతలను పరిశీలించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని తెలిపారు. యువతి ఆరోగ్యం నిలకడగా ఉందని, నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం జగన్‌ ఆదేశించారని తానేటి వనిత తెలిపారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేశారని అన్నారు. చంద్రబాబు మానసికంగా బాధపడుతున్న యువతి విషయంలోనూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.


Tags:    

Similar News