చంద్రుడి మీద ఎంత వేడి ఉందో.. డేటా పంపిన ప్రజ్ఞాన్ రోవర్

భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతంగా జాబిల్లిపై దిగి చరిత్ర సృష్టించి

Update: 2023-08-28 02:32 GMT

భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతంగా జాబిల్లిపై దిగి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మిషన్ భాగంగా చంద్రుడిపై దిగిన ప్రజ్ఞాన్ రోవర్ తన పని మొదలుపెట్టింది. విక్రమ్ ల్యాండర్ నుంచి చంద్రుడి ఉపరితలంపైకి దిగిన ప్రజ్ఞాన్ రోవర్ అక్కడి వాతావరణంపై కీలక డేటా పంపించడం మొదలుపెట్టింది. చంద్రుడిపై ఎంత వేడి నమోదైందో తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 50 డిగ్రీలు ఉన్నట్టు తెలిపింది ప్రజ్ఞాన్ డేటా. చంద్రుడి ఉపరితలంపై పది సెంటీమీటర్ల లోతులోనూ ఉష్ణోగ్రత ఎంత ఉందో తెలుసుకునే సామర్థ్యం ప్రజ్ఞాన్ రోవర్ కు ఉంది. 8 సెంటీమీటర్ల లోతులో మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్టు గుర్తించింది. ఈ డేటాను విక్రమ్ ల్యాండర్ ద్వారా భూమికి చేరవేసింది. ఈ విషయంపై ఇస్రో ఓ ప్రకటన చేసింది. చంద్రుడి దక్షిణ ధృవంలో ఎలాంటి ఉష్ణోగ్రతలు ఉంటాయన్న దానిపై ఇప్పటివరకు ఇదే తొలి సమాచారం అని తెలిపింది.

విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్‌ల మిషన్ జీవిత కాలం కేవలం 14 రోజులు మాత్రమేనని ఇప్పటికే ఇస్రో తెలిపింది. విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్‌లు సోలార్ ఎనర్జీ ఆధారంగా పనిచేస్తూ ఉండడంతో.. వీటి జీవిత కాలం 14 రోజులు. సూర్యరశ్మిని ఎనర్జీగా మార్చుకోవడం ద్వారా ఈ రెండూ పనిచేస్తుంటాయి. విక్రమ్ ల్యాండర్‌కు మూడు వైపులా సోలార్ ప్యానల్స్ ఉన్నాయి. వీటితో అవసరమైనంత వెలుతురును ఇది పొందగలదు. ఇక 14 రోజుల తర్వాత చంద్రుడిపైన విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతమంతా చీకటి పడనుంది. చంద్రుడిపైన ఒక రోజు భూమిపై 14 రోజులతో సమానం. చంద్రుడిపై ఆగస్ట్ 23న సూర్యోదయం అయింది. ఈ పగటిపూట వాతావరణం అక్కడ సెప్టెంబర్ 5 నుంచి 6వ తారీఖు వరకు ఉండనుంది. ఆ తర్వాత చంద్రుడిపై ఉష్ణోగ్రతలు భారీగా పడిపోనున్నాయి. ‘‘సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ప్రతీది కూడా అంధకారంలోకి వెళ్తుంది. ఉష్ణోగ్రతలు మైనస్ 180 డిగ్రీ సెల్సియస్‌కి పడిపోతాయి. ఆ ఉష్ణోగ్రతల్లో ఈ సిస్టమ్స్‌ను సురక్షితంగా ఉంచడం సాధ్యం కాదు’’ అని ఇస్రో చీఫ్ డాక్టర్ సోమనాథ్ అన్నారు. చంద్రుడిపై పడిపోయే ఉష్ణోగ్రతలను ఈ సిస్టమ్స్ తట్టుకుని నిలదొక్కుకునే అవకాశం చాలా కష్టమని సోమనాథ్ అన్నారు. ఈ సిస్టమ్స్‌ సురక్షితంగా ఉంటే మాకు చాలా సంతోషం. ఒకవేళ ఇవి మళ్లీ యాక్టివ్ అయితే, వాటితో మేం మళ్లీ పనిచేస్తామని ఆయన అన్నారు.


Tags:    

Similar News