KCR : కేసీఆర్ అలాంటి నిర్ణయం తీసుకుంటే.. ఇక నేతలు ఏం చేస్తారో?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. కాలి తుంటి ఎముకకు సర్జరీ జరగడంతో ఆయన నందినగర్ తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు మూడు వారాలు దాటుతుంది. ఇప్పటి వరకూ ఆయన రాజకీయాల్లో యాక్టివ్ కాలేదు. తన వద్దకు వచ్చిన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కావడం మినహా ఆయన ప్రత్యేకంగా పాల్గొన్న పార్టీ కార్యక్రమాలు కూడా లేవు. పూర్తి బాధ్యతలను ఆయన తన కుమారుడు కేటీఆర్ పైనే వదిలేశారు. బయటకు వచ్చి ఆయన తన ఓటమిపై ప్రజలతో ఎలాంటి అభిప్రాయాన్ని పంచుకోలేదు. ఇప్పుడిప్పుడే ఆయన ఓటమి బాధ నుంచి కోలుకుంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.
జాతీయ పార్టీగా మార్చి...
కేసీఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలని భావించారు. ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీకి పరిమితమవ్వాలని కూడా భావించినట్లు చెబుతున్నారు. అందుకే మహారాష్ట్ర పైనే తెలంగాణ ఎన్నికల ముందు ప్రత్యేక ఫోకస్ పెట్టారంటారు. మహారాష్ట్ర నుంచి పార్టీ జయకేతనం ఎగురవేసి ఢిల్లీలో గులాబీ పార్టీ జెండా రెప రెపలాడేలా చూడాలని భావించారు. కర్ణాటక ఎన్నికలకు కూడా దూరంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో ఓటమి తర్వాత పూర్తి నిరాశలోకి వెళ్లిపోయారు. అందుకే ఆయన ఇప్పట్లో రాజకీయంగా యాక్టివ్ కాకపోవచ్చన్న అంచనాలో ఉన్నారు.
ఏపీలో శాఖను ...
అయితే ఏపీలోనూ బీఆర్ఎస్ శాఖను కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించారు. ఏపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని నాడు ప్రకటించారు కూడా. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా అక్కడకు వెళ్లిన మంత్రులు కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. ఏపీలో కేసీఆర్ కొంత ఫ్యాన్స్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఆయన పనితీరు కూడా అనేక మందిని ఆకట్టుకుంది. పథకాలు కూడా ఏపీ ప్రజలను ఆకర్షించాయంటారు. అందుకే అక్కడ జరిగే ఎన్నికలలో పోటీ చేసి కనీస స్థానాలను సాధించాలన్న ఆలోచన అప్పట్లో కేసీఆర్ చేశారు.
పోటీకి దూరం...
బీఆర్ఎస్ శాఖను ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించుకున్నారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఏపీలో బీఆర్ఎస్ ఇప్పుడు స్దబ్దుగా ఉంది. ఎక్కడా యాక్టివ్ గా లేదు. ఏపీలో ఎన్నికలకు పెద్దగా సమయం కూడా లేదు. మార్చి, ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో లోక్‌సభ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో ముందుగా తాను తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం కేసీఆర్ కు ఉంది. ఇప్పుడు ఏపీ వైపు చూసినా అసలు తెలంగాణలో తన పార్టీ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని ఆయన భావిస్తున్నారు. అందుకే ఏపీ ఎన్నికల్లో ఈసారి బీఆర్ఎస్ పోట ీచేసే అవకాశాలు లేవు. దీంతో ఆ పార్టీలో చేరిన నేతల రాజకీయ భవిష్యత్ ఏమవుతుందోనన్న ఆందోళన నెలకొంది.