KCR : ఎవరి మీద ఈ అలక బాసూ... ఎందుకంత కోపం.. కేసీఆరూ
ఎన్నికలన్నాక గెలుపోటములు సహజం. ఎవరో ఒకరు గెలవడం.. మరొకరు ఓడిపోవడం ఖాయం.
ఎన్నికలన్నాక గెలుపోటములు సహజం. ఎవరో ఒకరు గెలవడం.. మరొకరు ఓడిపోవడం ఖాయం. ఇది అందరికీ తెలిసిందే. రాజకీయ పార్టీలు పెట్టిన నేతలకైనా.. పాలిటిక్స్ లోకి వచ్చిన వారికి ఎవరికైనా ఈ విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ రాజకీయాల్లో ఆరితేరిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అసలు చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం ఇప్పటిది కాదు. నలభై పదుల రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో డక్కీమొక్కీలను తిన్నారు. ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఓటములను చవి చూశారు. విజయాలను రుచిని కూడా ఆయన జుర్రుకున్నారు. రెండుసార్లు ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టారు.
చెప్పా పెట్టకుండా....
అలాంటి కేసీఆర్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే చెప్పాపెట్టకుండా ఫాం హౌస్ కు వెళ్లిపోవడాన్ని మాత్రం చాలా మంది తప్పు పడుతున్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ అంటే బీఆర్ఎస్ కు తక్కువ ఓట్లు రాలేదు. దాదాపు 38 శాతం మందికి పైగానే ఓటు వేశారు. 39 స్థానాలను కట్టబెట్టారు. కాకుంటే మూడో సారి ముఖ్యమంత్రి పదవి దక్కలేదంతే. అంత మాత్రాన ఆయన ఎవరికీ ఏం చెప్పకుండా.. కనీసం తనకు ఓటు వేసిన వారికి ధన్యవాదాలు కూడా చెప్పకపోవడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేయాలంటున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని.. ప్రత్యేకంగా కాంగ్రెస్ గెలుపును ఆయన జీర్ణించుకోలేకపోతున్నారన్నది దీనిని బట్టి అర్థమవుతుంది.
ఏ రాజకీయ నేత అయినా...
సహజంగా ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా ఓటమి తర్వాత మీడియా ముందుకు వచ్చి ప్రజల తీర్పును శిరసావహిస్తానని చెబుతారు. తాము నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని, ప్రజల సమస్యలకు అండగా నిలబడతామని మాట ఇస్తారు. దాదాపు 96 సభల్లో రెండున్నర నెలల నుంచి ఎన్నో రకమైన వాగ్దానాలు చేసి... ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ ఓటమి మాట తన చెవుల్లో వినపూడకూడదనే ఫాం హౌస్ కు వెళ్లారా? అన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. రాజకీయ పార్టీని అందులో జాతీయ పార్టీని నడిపే నేత కేసీఆర్ కు ఇది తగదు అన్న కామెంట్స్ నెటిజన్ల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి.
గెంటేసిన వాళ్లు...
ఫలితాల తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ మీడియా ముందుకు వచ్చి చెప్పారు. అది వేరే విషయం. బీఆర్ఎస్ అంటే కేసీఆర్. కేసీఆర్ అంటే బీఆర్ఎస్. అంతే.. ఆయనను చూసే ప్రజలు రెండుసార్లు గెలిపించిన వైనాన్ని ఆయన మర్చిపోయినట్లున్నారు. కనీసం తనకు ఓటేసిన ప్రజలకు ధన్యావాదాలు చెప్పి, తాము తొమ్మిదేళ్ల పాలనలో చేసిన తప్పొప్పులను సమీక్షించుకుంటామని చెప్పి వెళితే బాగుండేదన్న అభిప్రాయం అంతా వ్యక్తమవుతుంది. అయితే ఆయన ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారని, తాను బయటకు గెంటేసిన వారే గెలిచి గేలి చేస్తారన్న ఉద్దేశ్యంతో ఫాం హౌస్ కు వెళ్లిపోయారా? అన్న అనుమానాలు అయితే ప్రజల్లో ఉంది. ఇది కేసీఆర్ వంటి నేతకు తగని పని.