Chandrababu: చంద్రబాబు లెక్కలు పక్కా... ఫ్యూచర్ ప్లాన్ మాత్రం అదుర్స్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఫ్యూచర్ ప్లాన్ తోనే అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కనపడుతుంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఫ్యూచర్ ప్లాన్ తోనే అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కనపడుతుంది. సీనియర్లను ఒకింత దూరం చేయడం కూడా రానున్న కాలంలో యువనేత లోకేష్ కు మార్గం సుగమం చేయడం కోసమేనన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకూ ఎంపిక చేసిన జాబితాలో ఎక్కువ మంది కొత్త వాళ్లు, యువకులకే ప్రాధాన్యత ఇచ్చారు. సీనియర్ లీడర్లలో కొందరు నేతల కోడళ్లు, కుమార్తెలు, కుమారులకు ఇవ్వడం కూడా లోకేష్ ను దృష్టిలో పెట్టుకుని చేసిందేనన్న టాక్ బలంగా పార్టీలో వినిపిస్తుంది. దీంతో పాటు సీనియర్లతో భవిష్యత్ లో అనేక సమస్యలు తలెత్తే అవకాశముందని కూడా ఆయన భావించి కొత్తవారికి సీట్లు కేటాయించారని పార్టీనేతలే అభిప్రాయపడుతున్నారు.
ప్రజల్లో పాత బడిపోవడం...
సీనియర్లు పాత బడిపోయారు. వారు కొన్ని సార్లు గెలిచారు. మరికొన్ని సార్లు ఓడిపోయారు. ప్రజల్లోనూ పాత మొహాలంటే కొంత విరక్తి పుట్టింది. కొత్త వారైతే తమ మాటను వింటారని కొంత శాతం ఓటర్లయినా పార్టీకి అనుకూలంగా పనిచేస్తారు. సీనియర్ నేతల వల్ల పార్టీకి ఉపయోగం లేకపోగా నష్టమేనన్న అభిప్రాయం టీడీపీ చీఫ్ లో కనిపిస్తుంది. క్యాడర్ ను పట్టించుకోక పోవడం, ప్రజల్లో మమేకం కాకపోవడం, అనేక సార్లు ఓటమి పాలు కావడం వంటి కారణాలతో కొందరిని తప్పనిసరి పరిస్థితుల్లో పక్కన పెట్టారు. బండారు సత్యనారాయణమూర్తి, దేవినేని ఉమామహేశ్వరరావు, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాధరెడ్డి వంటి వారిని కావాలనే జాబితా నుంచి స్కిప్ చేశారన్న వాదన కూడా పార్టీలో ఉంది.
మంత్రి వర్గంలోనూ...
ఒకవేళ అధికారంలోకి వస్తే సీనియర్లకు మంత్రి పదవులు ఒక సమస్య అవుతుంది. ప్రతి ఒక్కరూ మంత్రి పదవి కోసం పోటీ పడతారు. పార్టీలో తమ సీనియారిటీని, సిన్సియారిటీని సాకుగా చూపి తమకు కేబినెట్ లో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తారు. వత్తిడి తీవ్రంగా ఉంటుంది. అందుకే ముందుగానే మొగ్గలోనే తుంచివేస్తే అన్నట్లు చంద్రబాబు వారికి పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీఇచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. మరోవైపు కూటమిలో భాగస్వామ్య పార్టీలకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సి రావడంతో వారికి ఆదిలోనే చెక్ పెట్టేశారంటున్నారు కొందరు పార్టీ నేతలు.
నెంబర్ టూగా...
మరోవైపు అధికారంలోకి వస్తే లోకేష్ ప్రభుత్వంలోనూ నెంబర్ టూ గా ఉండాలి. సీనియర్లు ఉంటే వారి శాఖల్లో లోకేష్ జోక్యం చేసుకునే అవకాశముండదు.2014 లో లోకేష్ మంత్రి అయిన తర్వాత అప్పట్లో సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు లాంటి వారి వద్ద ఉన్న శాఖలపై నిర్ణయాలు తీసుకోవాలంటే లోకేష్ కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి మరోసారి లోకేష్ కు రానివ్వకూడదన్న కారణంగానే చంద్రబాబు సీనియర్ నేతలకు టిక్కెట్లు ఇవ్వకుండా వారి కుటుంబ సభ్యులకు అవకాశమిచ్చే ప్రయత్నం చేసినట్లు కనపడుతుంది. మొత్తం మీద చంద్రబాబు మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే పరిణామాలను కూడా బేరీజు వేసుకుని మరీ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కనపడుతుంది.